శ్రీకాకుళం : అక్టోబరు 29 : జిల్లాలో ఇసుక పరిస్ధితిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత మూడు నెలలుగా వరదలు రావడంతో ఇసుక తవ్వకాలలో సమస్య ఏర్పడిందన్నారు. ఇసుకపై జిల్లాలో కొన్ని చర్యలు చేపట్టాలని, జిల్లాలోని పరిస్థితిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇసుక విధానాన్ని పారదర్శకంగా చేపడుతున్నామని ముఖ్య మంత్రి చెప్పారు. ఇసుక రవాణాకు నిర్దేశించిన ధరకు ఎవరు వచ్చినా అవకాశం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో 267 రీచ్ లలో 62 రీచ్ లు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన వాటిలో వరద నీరు ఉందని చెప్పారు. వరద నీరు వారంలో తగ్గే అవకాశం ఉందని పేర్కొంటూ వారం రోజుల తరువాత ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లరాదని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో చాలా పారదర్శకంగా ఇసుక ప్రక్రియ జరుగుతుందన్నారు. వరద ఉన్నప్పటికీ 6 రీచ్ లను గుర్తించి ఇసుకకు కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, డిఆర్ఓ బలివాడ దయానిధి, నగర పాలక సంస్థ కమీషనర్ ఎం.గీతా దేవి, ఆర్డీవో ఎం.వి.రమణ, జెడ్పీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి జి.చక్రధర రావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన్ రావు, మత్స్య శాఖ జెడి డా.వివి కృష్ణ మూర్తి, గనుల శాఖ డిడి ఎస్.కె.వి.సత్యనారాయణ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాధ రావు, డిబిసిఎస్ పి.ఓ డా.ఎం.రమణ కుమార్, డిఇఓ కె. చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.