శ్రీకాకుళం : అక్టోబరు 31 : శిక్కోలు ఆదివాసీ తొలి అమర వీరులు కోరన్న మంగన్నలు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో తొలి రక్తతర్పణ చేసిన ఆదివాసీ వీరులు ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్నలు.వీరు అమరత్వం పొందిన రోజు అక్టోబర్ 31. నేటికి అర్ధ శతాబ్ది గతించినా ఈ తొలి అమరుల త్యాగం స్మృతి గీతమై నేటికీ పోరాట దారుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒకప్పటి శ్రీకాకుళం జిల్లా నేడు విజయనగరం జిల్లా భూభాగంలో వున్న భద్రగిరి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలపై సాగుతున్న దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాటి కమ్యూనిస్టు పార్టీ ఆదివాసీలను సంఘటితపరచి గిరిజన సంఘాన్ని నెలకొల్పి 1958 నుండీ భూస్వామ్య, పెత్తందారీ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించింది. అప్పటి ఉద్యమ నాయకులు వసంతాడ రామలింగాచారి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, ఆరిక సోములు తదితరుల నాయకత్వంలో ఆదివాసీలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. భూముల దురాక్రమణకీ, వెట్టిచాకిరీకీ, అధిక వడ్డీలకీ, ఫారెస్ట్ అధికారుల జులుంకీ వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న కాలమది. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ పాలన విముక్తి కోసం సాగిన ఈ పోరాటం 1967 నాటికి సాయుధ పోరాటంగా మౌలిక మలుపును తీసుకుంది.అదే నక్సల్బరీ పంథా తూర్పు తీరాన్ని తాకిన మరో పోరాట కెరటంలా. శ్రీకాకుళానికి తాకింది అప్పుడే. భూస్వాముల, వడ్డీ వ్యాపారుల ఇళ్లపై వందల వేల సంఖ్యలో ప్రజలు దాడి చేయడం, పత్రాలను తగలబెట్టడం, రుణ విముక్తిని ప్రకటించడం, తాకట్టు పడిన పోడు భూములను స్వాధీనం చేసుకోవడం, ఇలా ఒకదాని తరువాత ఒకటిగా పోరాట సంఘటనలు సాగిపోయాయి. అలా మొదలైన తెగువ రామభద్రపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ తాలూకాలైన పార్వతీపురం, పాతపట్నం , పాలకొండ ప్రాంతాల్లోనూ ఉద్దాన తీర ప్రాంతంలో సైతం పోరాటం కెరటాలు కెరటాలుగా విస్తరించింది." శ్రీకాకుళంలోన చిందింది రక్తము కొండలెరుపెక్కినాయి పోరాడ బండలే కదిలినాయి". దేశంలో సాయుధ రైతాంగ వర్గ పోరాటాలకు చరిత్రలో మలుపు అనదగిన తేదీగా అక్టోబరు 31, 1967 ప్రసిద్ధి గాంచింది. చిరస్మరణీయంగా నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఒక భూస్వామి చేతిలోని తుపాకీ గుండ్లకు గురై, ఆదివాసీలయిన ఆరిక కోరన్న కొండగొర్రి మంగన్న లు అమరులై చరిత్రకెక్కారు.
1964 లో కమ్యూనిస్టు పార్టీలో మొదటి చీలిక నాటికే వెంపటాపు సత్యనారాయణ ("సత్యం" కొండబారిడి మాస్టారుగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీకాకుళ పోరాట నిర్మాత) ఆదిభట్ల కైలాసం శ్రీకాకుళం ఏజన్సీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరినీ విప్లవ రాజకీయాల వైపు పురికొల్పిన పల్లె రాములు మాష్టారు ఎక్కువ కాలం ఉద్యమంలో కొనసాగలేకపోయారు. వసంతాడ రామలింగాచారి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మైదాన ప్రాంతాల నించి వచ్చిన భూస్వాముల, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనుల్ని సంఘటితపరుస్తూ సత్యం, కైలాసాలు గిరిజనుల చైతన్య స్థాయి పెరిగే క్రమంలో పోరాట స్థాయిని పెంచుతూ ఉద్యమ కార్యాచరణను అందించారు. గిరిజన సహకార సంఘాలు, గిరిజన సంఘర్షణ సంఘాలను నెలకొల్పుతూ,సేకరించిన అటవీ వస్తువుల విక్రయాల్లో న్యాయమైన రేట్లు, న్యాయమైన తూనికలు మొదలైన ఆర్థిక పోరాటాలను నిర్వహిస్తూ పోడు భూముల, తాకట్టు పెట్టుకున్న భూముల విముక్తి కోసం, పోడు భూములపై హక్కు కోసం పోరాటాలను నిర్మించారు. ముఖ్యంగా గిరిజనుల మౌలిక అవసరాలైన బియ్యం,ఉప్పు, పప్పు ల కోసం విలువైన అటవీ సంపద మాత్రమే కాకుండా తమ నెత్తురు చెమటైన పోడు వ్యవసాయంలో తమ భూముల్లో తామే కంబారీ (పనివాల్లు)లయిన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు ఆయత్తం చేసింది నాయకత్వం. అలా నిర్మాణం చేస్తూ వచ్చిన గిరిజనుల సంఘటిత శక్తిని ప్రకటించడానికి శ్రీకాకుళం జిల్లా గిరిజన మహాసభను అక్టోబర్ 31న మొండెఖల్ అనే గ్రామంలో నిర్వహించ తలపెట్టారు. విస్తృత ప్రచారంతో సాగిన ఆ సభకు జిల్లా నలుమూలల పోరాట ప్రాంతాలనుంచి చీమల పుట్టల నుంచి కదిలి వచ్చినట్లుగా గిరిజనులు సభకు తరలి వస్తూ వుంటే "లేవిడి" అనే గ్రామం దగ్గర ఒక చెట్టు చాటున కాపుగాచిన రాజమండ్రి నుంచి వలస వచ్చిన భూస్వామి అతి కౄరంగా ప్రజా సమూహం పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో అక్కడికక్కడే ఇద్దరు గిరిజనులు నేలకొరిగారు. వారే కోరన్న, మంగన్నలు. ఈ వార్త జిల్లా అంతటా దావానలంలా వ్యాపించింది. సభా నిర్వహణ సన్నాహాల్లో ఉన్న సత్యం, కైలాసాలకు చేరింది. ఆ సభావేదిక నుంచే ఆత్మరక్షణ కోసమైనా సరే గిరిజనులు ఆయుధం పట్టక తప్పదని ప్రకటించారు.అలా కోరన్న, మంగన్నల అమరత్వం సాయుధ పోరాట ప్రకటనకు దారి చూపింది. ప్రజల చైతన్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రిస్తూ,ప్రజా వాగ్గేయకారుడు సుబ్బారావు పాణిగ్రాహి 'అక్టోబర్ 31' సంఘటనను 'జముకుల కథ' గా రూపొందించి విప్లవ సాంస్కృతికోద్యమానికి ఒక పోరాట ప్రేరణగా నిలిచారు. ఏలూరు ఖమ్మంల వంటి కేంద్రాలతో పాటు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తిరిగి శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి అశేష ప్రజల మద్దతును, ఎందరో బుద్ధి జీవుల, కవుల, కళాకారుల ప్రజాస్వామ్య వాదుల మద్ధతును కూడగట్టాడు విప్లవకవి పాణిగ్రాహి.
అమరవీరులు కోరన్న మంగన్నలకు జోహార్లు