శ్రీకాకుళం : అక్టోబర్ 29 : రాష్ట్రంలో అలాగే జిల్లాలో ఇసుక కొరతకు ప్రకృతి ఆటంకం తప్ప ప్రభుత్వ తప్పిదం లేనేలేదని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.గత దశాబ్దన్నర కాలంలో లేని రికార్డు స్థాయి వర్షాల కారణంగా జిల్లాలో ప్రధాన నదులైన నాగావళి, వంశధారలలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, ఉద్ధృతి తగ్గిన వెంటనే ప్రజలకు పూర్తి ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఇసుక కొరత అంశంపై శ్రీకాకుళంలో మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలో ప్రస్తుతం 11 రీచ్ లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వీటిలో 5,09, 360 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. ఇంకా మరికొన్ని రీచ్లను గుర్తించామని వాటిలో 2,68,465 క్యూబిక్ మీటర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అవి కూడా వరదలు తగ్గిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఆయా రీచ్ ల వద్దకు వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదని చెప్పారు. జిల్లాలో కొత్తగా మరో 16 రీచ్ లకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, అవి రాగానే అదనంగా మరో 10వేల క్యూ.మీ.కు పైగా ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు.వరదలు వచ్చినా అక్రమంగా ఇసుకను తవ్వేస్తూ టీడీపీ నేతలు జేబులు నింపుకునే వారిని, వారికి అలవాటుగా మారిన వ్యవహారాన్ని తాము అడ్డుకోవడంతోనే ఇసుక విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యుడి కంటికి సైతం వరదలు కనిపిస్తున్నాయని, అయినా కొందరు పనిగట్టుకొని భవన నిర్మాణ కార్మికులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.ఉపాధి సమస్య ఉందని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న మూడు నెలలకు ఇసుక త్రవ్వకాల అనుమతులు సరళతరం చేయడం గ్రామ సచివాలయాలకు బాధ్యతలు అప్పగించడం అందులో భాగమేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం త్రవ్వకాలు జరిపిన సొమ్ము చేసుకున్నవారు ప్రస్తుత విధానంలో పూర్తి పారదర్శకత ఉండడంతో ఏంచేయాలో పాలుపోక ఇలాంటి చవకబారు విమర్శలు చేస్తున్నారని మంత్రి కృష్ణదాస్ ఆ ప్రకటనలో ఎద్దేవా చేశారు.
జిల్లాలో ఇసుక కొరత లేదు మంత్రి ధర్మాన