ముంబై/చండీగఢ్ : మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. జాతీయ మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తాయని తెలిపాయి. హరియాణాలో మాత్రం ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా కొద్దిగా విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించడంతో ఆ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాంటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు సాధించలేకపోయాయి. దీంతో హరియాణాలో హంగ్ ఏర్పడింది. అయితే 10 స్థానాలు గెలుచుకున్న జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. అయితే జేజేపీ మద్దతు బీజేపీకే ఉందని హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేజేపీ మద్దతు ఇస్తుందన్న విశ్వాసంతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం.