బాలల హక్కులను కాపాడాలి : మంత్రి కృష్ణదాస్

శ్రీకాకుళం : నవంబర్ 20 : బాలల హక్కులను కాపాడటం మనందరి బాధ్యత అని
రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద బాల బాలికలతో ర్యాలీ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని, జిల్లా కలెక్టర్ జె.నివాస్ తో కలిసి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సూర్యమహల్ జంక్షన్ వరకు కలెక్టర్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడి వారిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు యాచక వృత్తి నుండి బాలలను రక్షించడం, వీధి బాలలను, అనాధ బాలలను రక్షించి పిల్లలు లేని తల్లితండ్రులకు చట్టపరంగా దత్తత ఇచ్చే కార్యక్రమాలను పటిష్టంగా అమలుచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. బాలల విద్యను నిరాటంకంగా కొనసాగించేందుకు "జగనన్న అమ్మఒడి" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతిని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఈ నెల 14 నుండి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించి, బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. అందులో భాగంగా పెద్దఎత్తున ర్యాలీని ఏర్పాటుచేసుకోవడం జరిగిందని తెలిపారు.1989 నవంబర్ 20న  బాలల హక్కుల తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించిందని, మనదేశంలో 1992 డిసెంబర్ 11న ఆమోదించడం జరిగిందని మంత్రి చెప్పారు. ఈ హక్కులను 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలలందరు అనుభవించే విధంగా ప్రజలు కృషి చేయాలన్నారు.బాలలను రక్షించేందుకు బాల్య వివాహ నిషేధ చట్టం 2006, లైంగిక నేరాల రక్షణ చట్టం 2012, బాల కార్మికుల నిషేధ చట్టం, బాలల న్యాయ చట్టాలను కూడా పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు.   బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయికి, 21 ఏళ్ల లోపు అబ్బాయికి వివాహం చేసినట్లయితే అందరికి 2సంవత్సరాలు జైలు, లక్ష రూపాయల జరిమానా ఉంటుందని,12 ఏళ్లలోపు బాలికలపై లైంగిక నేరాలు (అత్యాచారాలు)  జరిగినపుడు POCSO చట్టం క్రింద ఉరిశిక్షను విధించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. బాలలను అస్లీల చిత్రాలకు ఉపయోగిస్తే 7 సంవత్సరాల  జైలుశిక్ష వేయడం జరుగుతుందని అన్నారు.
బాలలు ఆపదలో ఉన్న సమయంలో 1098 చైల్డ్ లైన్, 100 పోలీసు, 181 మహిళ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే సమాచారం అందిన గంట లోపే ప్రమాద స్థలానికి చేరుకొని రక్షించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకం ద్వారా జిల్లాలో 893 బాల్య వివాహాలను నిలుపుదల చేయడం జరిగిందని,309 మంది  బాలికలను లైంగిక వేధింపుల నుండి,1686 మంది బాల కార్మికులను,254 మంది యాచక వృత్తి నుండి రక్షించడం జరిగిందని మంత్రి వివరించారు.అనంతరం చైల్డ్ లైన్, బాల్య వివాహాల చట్టం అమలుపై కరపత్రాలను మంత్రి విడుదల చేసారు.స్వచ్ఛతే సేవా కార్యక్రమంపై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏర్పాటుచేసిన ప్రచార వాహనానికి పచ్చ జెండా ఊపి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, మహిళా,శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు జి.జయదేవి, సమగ్ర బాలల పరిరక్షణ సంస్థ పథక సంచాలకులు కె.వి.రమణ, జిల్లా విద్యా శాఖాధికారి కె.చంద్రకళ, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు, శిశు గృహ మేనేజర్ కె.నరేష్, కౌన్సిలర్ డి.సీతారాం, చైల్డ్ లైన్ సమన్వయకర్త పి.హేమ లత, సామాజిక కార్యకర్త డి.మీనాక్షి, పి.ఓ ఐ.లక్ష్ము నాయుడు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు పి.వి.రమణ, కె.గోపాల్ రెడ్డి , బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.