శ్రీకాకుళం : నవంబరు 5: స్పందన కార్యక్రమంలో అందిన ఆర్జీలపై నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ జిల్లా అధికారులను కోరారు. విజయనగరంలోని ఆనంద గజపతి కళా క్షేత్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులతో స్పందన ఆర్జీలపై శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ పాల్గొని మాట్లాడారు.జిల్లాలో వచ్చిన స్పందన ఆర్జీలు నాణ్యమైన పరిష్కారం కావాలని, స్వీకరించిన ఆర్జీపై విచారణ చేయాలని సూచించారు. అర్హతలను పరిశీలించి, వాటిపై సమాచారం ఆర్జీదారునికి తెలియజేయాలన్నారు. డిసెంబరు నెల నుండి స్పందన ఆర్జీలపై కాల్ సెంటర్ ద్వారా ప్రజల స్పందనను కోరడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్జీదారులు తమ సమస్యలు పరిష్కారం అయ్యాయనే సంతృప్తి చెందాలన్నారు. ఆర్జీదారుల నుండి వినతులను చిరునవ్వుతో స్వీకరించి, పరిష్కారం చూపినపుడే ప్రజల సంతృప్తిస్థాయిని పెంచగలమని చెప్పారు.పురపాలక శాఖ కమీషనర్ విజయ కుమార్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పడిన తరువాత వచ్చిన దరఖాస్తులపై వెంటనే విచారణ చేసి పరిష్కరించవచ్చని సూచించారు.డిఐజి పాలరాజు మాట్లాడుతూ 40 వేల ఆర్జీలు పోలీసు స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు అందాయన్నారు. స్పందన కొరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, 4 వేల కేసులు కుటుంబ సలహాల ద్వారా పరిష్కారం చేసామని పేర్కొన్నారు. 30 శాతం ఎఫ్ఐఆర్ అవుతున్నాయని తెలిపారు. అధికారుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, గ్రామానికి వెళ్లి విధిగా విచారణ చేయాలని వివరించారు.
పౌర సరఫరాల శాఖ సంచాలకులు అరుణ్ బాబు మాట్లాడుతూ గ్రామ, వార్డులలో రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అవి ఇ.కె.వై.సిలో ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను కట్టినవారు, కార్లు కలిగి ఉన్నవారు, భూములు కలిగి ఉన్నవారు తదితరులు తెల్ల రేషన్ కార్డు పొందుటకు అనర్హులని ఆయన స్పష్టం చేసారు.ఆరు అంచెల విధానంలో ఆన్ లైన్ లో దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని, అవసరం మేరకు సంబంధిత అధికారులకు పరిశీలనకు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలోను పరిశీలన చేయడం జరుగుతుందని అన్నారు.రాజా బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 14 రకాల పింఛన్లు మంజూరుచేయడం జరుగుతుందని, 53 లక్షల మందికి పింఛన్లను పంపిణీచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రూ. 1450 కోట్లు వెచ్చించడం జరుగుతుందని అన్నారు.సిసిఎల్ఏ స్పందన విభాగం అధికారి వెట్రి సెల్వి రెవెన్యూ అంశాలపై తెలియజేస్తూ ఇప్పటివరకు 2,21,116 రెవెన్యూ సంబంధిత ఆర్జీలు స్పందనలో అందాయన్నారు. వీటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, ఎస్పీలు ఆర్.ఎన్. అమ్మి రెడ్డి,రాజ కుమారి, విజయనగరం జె సి-2 ఆర్.కూర్మనాథ్, వివిధ శాఖల అధికారులు హరికృష్ణ, బి.ఆర్.అంబేద్కర్, జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్పందనలో వచ్చిన సమస్యలపై మంచి పరిస్కారం చూపాలి