భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి

శ్రీకాకుళం : నవంబరు 26 : భారత రాజ్యాంగం నుండే హక్కులు, బాధ్యతలు, విధులు వచ్చాయని,  కావున  ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సహాయ ప్రభుత్వ న్యాయవాది టి.సుధారాణి విద్యార్ధులకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెట్ శ్రీ, నెహ్రు యువక కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ర్యాలీ కార్యక్రమం జరిగింది. అనంతరం కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి. వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి తయారుచేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదం తెలిపిందన్నారు. తర్వాత 1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్న సంగతిని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసారు. నవంబర్ 26వ తేదీన నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్‌గా పిలుస్తారని ఆమె అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 70 ఏళ్లు పూర్తయిందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు, బాధ్యతల కొరకు యువత పోటీపడాలని, అందుకు రాజ్యాంగం గురించి ప్రతీ ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆమె కోరారు. రాజ్యాంగ దినోత్సవం ప్రతిజ్ఞను విద్యార్ధులతో చేయించిన ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు  గెలుపొందిన కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్ధులు డి.పావణి, యం.హేమలత, బి.శ్రీజ లకు ఆమె జ్ఞాపిక, సర్టిఫికేట్లను పంపిణీ చేసారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళా డిగ్రీ కళాశాల నుండి బయలుదేరిన ర్యాలీ పసగాడ సూర్యనారాయణ మిల్లు జంక్షన్ వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ సమన్వయ అధికారి యస్.శివప్రసాద్ రెడ్డి, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ( ఇన్ ఛార్జ్ )  బి.వి.ప్రసాదరావు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.శ్రీరాములు, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్, ఏ.పి.స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహాయ మేనేజర్ యన్.గోవిందరావు, కళాశాల పాలిటిక్స్ హెచ్.ఓ.డి శంకర నారాయణ, విశ్రాంత ఉద్యోగి వి.జగన్నాథం నాయుడు, కె.సత్యనారాయణ, బి.చంద్రపతిరావు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.