శ్రీకాకుళం : నవంబరు 29 : పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక తుది నివేదిక తయారీపై సంయుక్త కలెక్టర్ 2 రెడ్డి గున్నయ్య అధికారులతో సమీక్షించారు. శుక్రవారం, జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా పర్యావరణ ప్రణాళిక డ్రాఫ్ట్ రూపకల్పనపై అధికారులతో జె.సి. 2 నిర్వహించిన సమావేశంలో ఘనవ్యర్ధాల నిర్వహణ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్, ప్రమాదకారకాల వేస్ట్ మేనేజ్ మెంట్, వాటర్ క్వాలిటీ మేనేజ్ మెంట్, నాణ్యమైన మంచినీటి లభ్యత, నదీ పరీవాహక ప్రాంతాలలో చేపడుతున్న చర్యలు, నదీ జలాలను కలుషితం చేసే అంశాలు, వర్షపు నీటిని ఒడిసి పట్టి నిల్వ చేసే చర్యలు, పరిశ్రమల వ్యర్ధాల నిర్వహణ, నాణ్యమైన గాలి (వాయువు, పరిశ్రమల నుండి వెలువడే కలుషితమైన గాలి నిర్వహణ, మైనింగ్ కార్యకలాపాల నిర్వహణ, శబ్ద కాలుష్యం- నివారణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణలపై రూపొందించిన ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కాలుష్య నివారణ బోర్డు కార్యనిర్వాహక ఇంజనరు శంకర్ నాయక్ మాట్లాడుతూ నెషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ గా విశ్రాంత చీఫ్ సెక్రటరీ శేషశయన రెడ్డిని నియమించారని తెలిపారు.పర్యావరణ పరిరక్షణ అంశాల అమలును ట్రిబ్యునల్ చైర్మన్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ అంశాలపై అధికారులు అందించిన సమాచారాన్ని అనుసరించి జిల్లా పర్యావరణ ప్రణాళిక తుది నివేదిక తయారు చేయడం జరిగినదని చెప్పారు.ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని చెప్పారు. అధికారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధి విధానాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.ఈ సమావేశానికి శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, ఇఛ్ఛాపురం, ఆమదాల వలస, పలాస మున్సిపల్ కమీషనర్లు జి.గీతాదేవి, ఇ.లిల్లీ పుష్పనాధం, ఎన్.రమేష్, జి.నాగేంద్ర కుమార్, ఎం.రవి సుధాకర్, టి.నాగేంద్ర కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎం.చెంచయ్య, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ. పి.సుగుణాకర రావు, గ్రామీణ మంచి నీటి సరఫరా కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాసరావు, ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీరు రాంబాబు, జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు వై.వీర శేఖర్, మైన్స్ ఉపసంచాలకులు ఎస్.కె.వి.సత్యన్నారాయణ తదితరులు హాజరైనారు.
పర్యావరణ ప్రణాళిక తుది నివేదిక తయారీ : సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య