శ్రీకాకుళం : నవంబరు 10 : జిల్లాలో పింఛను పొందుతున్న వృద్ధ కళాకారులు ఈ నెల 20లోగా లైఫ్ సర్టిఫికేట్లను తమ కార్యాలయానికి సమర్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేశ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలో 686 మంది వృద్ధ కళాకారులు పింఛన్లను పొందుతున్నారని, వారందరూ ప్రతీ ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికేట్లను నవంబర్ 20లోగా జిల్లా పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ, అఫీషియల్ కాలనీ, శ్రీకాకుళం వారికి స్వయంగా సమర్పించాలని కోరారు. ఇప్పటివరకు వృద్ధ కళాకారుల ఖాతాలలో పింఛన్లు జమకాబడనట్లయితే అటువంటి ఖాతా పుస్తకాన్ని సంబంధిత బ్యాంకు నందు అప్ డేట్ చేయించి దాని ప్రతిని, ఆధార్ కార్డు ప్రతిని, స్వీయ దరఖాస్తు ఫారాన్ని తమ కార్యాలయానికి సమర్పించాలని కోరారు. గడువులోగా లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించిన వృద్ధ కళాకారులకు మాత్రమే సంచాలకులు, భాషా మరియు సాంస్కృతిక శాఖ, విజయవాడ వారి నుండి పింఛన్లు జమచేయబడతాయని స్పష్టం చేసారు. వృద్ధ కళాకారులు సమర్పించిన లైఫ్ సర్టిఫికేటు నందు పాస్ పోర్టు సైజు ఫొటోను అతికించి తమ పేరు, వయస్సు, చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నెంబరుతో పాటు ఆధార్ నెంబరు , బ్యాంకు ఖాతా, ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ తప్పనిసరిగా ఉండాలని డి.పి.ఆర్.ఓ ఆ ప్రకటనలో వివరించారు. ఈ విషయమై ఎటువంటి సందేహాలు ఉన్నఎడల 220004 ల్యాండ్ లైన్ నెంబరుకు లేదా 87903 02596 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.
20వ తేదీ లోగా వృద్ధ కళాకారులు లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి