2021 నాటికి వి.ఎం.ఆర్.డి.ఏ బృహత్తర జిల్లా అభివృద్ధి ప్రణాళిక

శ్రీకాకుళం : నవంబరు 27 : విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి ప్రాథికార సంస్ధ ప్రాంతంలో సమగ్రమైన అభివృధికి చర్యలు చేపట్టుటకు బృహత్తర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. వియంఆర్డిఏ ఆధ్వర్యంలో వియంఆర్డిఏ ప్రాంతంలో దృక్పథ ప్రణాళిక - 2051 పై ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సభాపతి పాల్గొని మాట్లాడుతూ అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని ప్రణాళికలో పొందుపరచాలన్నారు. ప్రణాళిక సమగ్రంగా, సమీకృతంగా ఉండాలని 2051 సంవత్సరం నాటి జనాభాకు అనుగుణంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో 974 కి.మీ మేర కోస్తా తీరం ఉందని, బ్రహ్మాండమైన కోస్టల్ కారిడర్ నిర్మించుటకు అనేక అవకాశాలు  ఉన్నాయని పేర్కొన్నారు. రవాణా రంగం కోసం సరిహద్దు రాష్ట్రాలకు అనుసంధానం చేసే అవకాశాలు పరిశీలించాలని అన్నారు. తద్వారా మార్కెటింగ్, వాణిజ్య, వ్యాపార రంగాలు అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. విన్ విన్ పరిస్థితి నెలకొనాలని సభాపతి అన్నారు. సమీకృత ప్రణాళికలు  ఉండాలని అన్నారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో అనేక వనరులు, ప్రకృతి ప్రాంతాలు ఉన్నాయని పర్యాటకంగాను అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. రవాణా రంగాన్ని అనుసంధానం చేయడం ప్రధాన అంశంగా చేర్చాలని అన్నారు. బి.ఆర్.టి.ఎస్ వంటి రహదారులు రావలసిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించకుండా తగు ప్రాధాన్యతను కల్పించి పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీఠ వేస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక సర్క్యూట్ లను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజి వ్యవస్ధ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, హెరిటేజ్, టెంపుల్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు.
వియంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ దృక్పథ, మాస్టర్ ప్రణాళికలు రూపొందించుటకు చర్యలు చేపట్టామన్నారు. బృహత్తర ప్రణాళికలు జనవరి నాటికి,  మాస్టర్ ప్లాన్ జూన్ నాటికి తయారీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2021 సంవత్సరం నాటికి ప్రణాళికలు అమలుకు యోచిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం వరకు విస్తరణ చేయుటకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. సిఆర్డిఏ తరువాత వియంఆర్డిఏ పెద్ద నగరాభివృద్ధి సంస్థ అన్నారు. శ్రీకాకుళం గేట్ వే లాంటిదని ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, ఒడిషాకు ప్రధాన ద్వారంలా ఉందని అన్నారు. అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అన్నారు. పర్యాటక, ఉత్పాదక రంగాలలో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ బుడగట్ల పాలెం వద్ద ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి ప్రతిపాదనలు వున్నాయన్నారు. డి.పి.ఆర్ లు సైతం సమర్పించడం జరిగిందన్నారు. జిల్లాలో రహదారుల అనుసంధానం అవసరం అన్నారు. వాటర్ రిజర్వాయర్ లు ఏర్పాటు చేయాలని తద్వారా నీటి నిల్వ చేసి భవిష్యత్ అవసరాలకు ఉపయోగించవచ్చని సూచించారు.
రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ రాజాంలో బై పాస్ రహదారి అవసరమన్నారు. రాజాంను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సూచించారు.లియ అసోసియేట్స్ సౌత్ ఆసియ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ ప్రతినిధి రమేష్ బృహత్తర ప్రణాళికను వివరించారు. 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని, 5837 చదరపు కి.మీ. ప్రాంతం వి.ఎం.ఆర్.డి.ఏ ఉందన్నారు. అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం అవసరమన్నారు. బృహత్తర ప్రణాళికలను తయారు చేయుటకు 3 జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం, పర్యాటక, తయారీ, ఐటి, ఆర్థిక తదితర రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని వాటిని బృహత్తర ప్రణాళికలో పొందుపరుచడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నం ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, భావనపాడు, కళింగపట్నంలలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రాబోతున్నాయని చెప్పారు. కోస్టల్ కారిడార్ కు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు వియంఆర్డిఏ పరిధిలో ఉన్నాయని వివరించారు. ఎకనామిక్ గ్రోత్ స్ట్రాటజీ తో ప్రణాళికలు చేపడుతున్నామని చెప్పారు.ఈ సందర్భంగా శాసన సభాపతి తమ్మినేని సీతారాం కు, శాసన సభ్యులు జోగులు కు వియంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ దుస్సాలువతో సత్కరించారు. వియంఆర్డిఏ చీఫ్ అర్బన్ ప్లానర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.