అమరావతి : నవంబరు 11: రాష్ట్రంలో మద్యపాన నియంత్రణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్య తగ్గించాలని ఉన్నతాధికారులను వైయస్ జగన్ ఆదేశించారు. ఇది జనవరి 1 వ తేదీ నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.అమరావతిలో ఆదాయం వస్తున్న శాఖలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు.ప్రతి రోజు ఉదయం 11.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలని ఉన్నతాధికారులకు సీఎం వైయస్ జగన్ సూచించారు. అందుకోసం విధి విధానాలను ఖరారు చేయాలని అధికారులను వైయస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో విడతల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని వైయస్ జగన్ సర్కార్ భావిస్తోంది. ఆ క్రమంలోనే తొలుత బెల్ట్ షాపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తుల నుంచి మద్యం షాపులను సైతం ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. అందులోభాగంగా ప్రస్తుతం ప్రభుత్వం ద్వారానే మద్యం షాపులు నడుస్తున్నాయి.అలాగే బార్ల సమయం కూడా కుదించడం ద్వారా మద్య నియంత్రణను గణనీయంగా తగ్గించాలని సీఎం వైయస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమీక్ష సమావేశంలో శాఖల వారీగా వస్తున్న ఆదాయాన్ని సీఎంకి ఉన్నతాధికారులు వివరించారు.
మద్యపాన నిషేధంపై మరో నిర్ణయం