శ్రీకాకుళం : నవంబరు 1:రాష్ట్ర అభివృధ్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రహదారులు, మరియు భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆనందమయి కళ్యాణమండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి, ముఖ్య అతిధిగా విచ్చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకోసం పొట్టి శ్రీరాములు అసువులు బాసారని, ఆయనను ఈ రోజు స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా వున్నదని అన్నారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్విహించడం జరుగుతున్నదన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ 1956 నవంబరు 1వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు, ఉద్యమాలలో, సమైఖ్య భావనలో మహోన్నత చైతన్యంతో అగ్రగామిగా అవతరించిందనేది ఒక చారిత్రాత్మక వాస్తవమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడాలనే భావనకు సుమారు 7 దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. ఈ ఆలోచనలకు భీజం పడిన రోజులలో విశాలాంధ్ర ఉద్యమం తెలుగు నేలపై వెల్లివిరిసిందని, ఈ నినాదమే క్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి పునాదులు వేసిందని చెప్పారు. మహాత్మా గాంధీజీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబరు 19వ తేదీన రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని,అదే సంవత్సరం డిశంబరు 15వ తేదీన అసువులు బాసిన రోజు నాటికి 58 రోజుల కఠోర దీక్ష చేసారని తెలిపారు.తెలుగు జాతి అంతటికి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసిన అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి, ఇతర త్యాగమూర్తులందరికి ఈ సందర్భంగా ఘననివాళులు అర్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా వున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందని,గడచిన 63 సవంత్సరాలుగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి “నవరత్నాల” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా చేయుటకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలు కూడా తమ వంతు అభివృధ్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. అమ్మఒడి పథకం లబ్దిదారులు తలొక వెయ్యి రూపాయలను పాఠశాల అభివృధ్ధికి అందించాలన్నారు.జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ,64 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు. తెలుగు, తమిళం, కన్నడ రాష్ట్రాలుగా భాషాప్రాతిపదికన 1956 నవంబరు 1వ తేదీన 3 భాషాప్రయుక్త రాష్టాలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రతీ భాషలోను సంస్కృతి, చరిత్ర, ప్రాంత వనరులలో ఒక ప్రత్యేకత వుంటుందన్నారు. ఒకే భాష మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఏర్పడడం వలన సమైక్యతా భావం పెంపొందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనేది పోరాటాలు, సత్యాగ్రహాలు, జీవిత త్యాగాల ఫలితంగా లభించిందన్నారు. తమిళ కవి తెలుగు భాషను సుందర తెలుగు అనేవారని, శ్రీకృష్ణ దేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష తీయదనాన్ని వర్ణించారని గుర్తు చేసారు. మాతృభాష కోసం ప్రాణాలొడ్డి పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు. పొట్టి శ్రీరాములు తన జీవితాన్ని త్యాగం చేసారన్నారు.వారి నుండి క్రమశిక్షణ, త్యాగం వంటి లక్షణాలను పుణికిపుచ్చుకోవాలన్నారు. విద్యార్ధులు తమ పాఠశాలలు, కళాశాలలను పరిశుభ్రంగా వుంచుకోవాలన్నారు. పరిశుభ్రతతోనే దేశాభివృధ్ధి ముడిపడి వుందన్నారు ఈ సందర్భంగా డా.అంబేద్కర్ మహాశయుని జ్ఞప్తికి తెచ్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వున్నదన్నారు. దేశపురోభివృధ్ధికి ఎనలేని సేవలందించిన వారిలో ప్రథముడు డా.బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా, సమాజంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసారని గుర్తుచేసారు. డా.బి.ఆర్. అంబేద్కర్, కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం వంటి మహనీయుల జీవతచరిత్రలను విద్యార్ధులు తెలుసుకోవాలని చెప్పారు. వారి స్ఫూర్తితో రాష్ట్ర అభివృధ్ధిలోను,దేశాభివృధ్ధిలోను భాగస్వాములు కావాలని చెప్పారు.ఈ సందర్భంలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు మంత్రి అప్పలరామయ్య, కొయ్యాన చిన్నమ్మి, జి.దమయంతి, రావాడ లక్ష్మీ నారాయణమ్మ, కోరాడ పార్వతీ దేవిలను సన్మానించారు. వ్యాసరచన, వ్యక్తృత్వపు పోటీలు, చిత్రలేఖనం పోటీలు, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన వివిధ పాఠశాల విద్యార్ధులకు ప్రశంసా పత్రాలను, బహుమతులను అందచేసారు. ఐ.సి.డి.ఎస్. వారి వంటలకు ప్రధమ, ద్వితీయ తృతీయ బహుమతులను అందచేసారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపన చేసిన సాయిప్రశాంతికి రూ.5000/- లు, నృత్యాలు అభినయించిన కళాకారులకు రూ.5000/-లు మంత్రి స్వయంగా అందచేసారు.ముందుగా బాపూజీ,పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూల మాలలు, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, మున్సిపల్ కమీషనరు గీతాదేవి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి అందరూ పాటు పడాలి : మంత్రి ధర్మాన