30వ తేదీ లోగా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన జరగాలి

శ్రీకాకుళం : నవంబర్ 7 : జిల్లాలోని రెవిన్యూ రికార్డులన్నీ ఈ నెల 30లోగా శుద్ధీకరణ కావాలని ( ప్యూరిఫికేషన్ ) సెక్రటరీ టు సిసిఎల్ఎ కె.ఆర్.బి.హెచ్.ఎన్.చక్రవర్తి సంయుక్త కలెక్టర్లను కోరారు. భూ రికార్డుల ప్యూరిఫికేషన్ పై సంయుక్త కలెక్టర్లు, ఆర్.డి.ఓలతో గురువారం ఉదయం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని భూరికార్డుల ప్యూరిఫికేషన్ కు  సంబంధించి  వెబ్ సైట్ నందు ప్రోఫార్మ-1ను పొందుపరచడం జరిగిందన్నారు. ప్రోఫార్మాను వెబ్ సైట్ నందు  ఏ విధంగా పొందుపరచాలో తెలియజేస్తూ, దీనికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసారు. ప్రతీ తహశీల్ధారు కార్యాలయంలో మూడు కంప్యూటర్లతో పాటు ముగ్గురు ఆపరేటర్లను, ఇంటర్నెట్ ను  ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రతీ రోజూ ఒక్కో ఆపరేటర్ 1 గ్రామం వంతున ముగ్గురు ఆపరేటర్లు మూడు గ్రామాలు చొప్పున పూర్తిచేయాలన్నారు. తద్వారా  నవంబరు 30తేదీ లోగా జిల్లాలోని  అన్ని రెవిన్యూ గ్రామాలు శుద్దీకరణ కావాలని ఆదేశించారు. వెబ్ ల్యాండ్ ఒరిజనల్ రీసెటిల్ మెంట్ రిజిష్టర్ (ఆర్.ఎస్.ఆర్)తో సరిపోల్చుకోవాలన్నారు. భూరికార్డులకు, వెబ్ ల్యాండ్ లోని తేడాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు.ఈ ప్రక్రియ నవంబర్ మాసాంతానికి పూర్తికావాలని, డిసెంబర్ 1 నుండి 2020 మే 31 వరకు గ్రామసభలు నిర్వహించి  పూర్తిస్ధాయిలో రెవిన్యూ రికార్డులు శుద్దీకరణ ప్రక్షాళన చేయాలన్నారు. 2020 జూన్ మాసం తరువాత ఈ-జమాబంది ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.