శ్రీకాకుళం : నవంబరు 26 : భారత 70వ రాజ్యాంగ దినోత్సం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగానికి ఆత్మగా పేర్కొనబడే పీఠికను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్పదన్నారు. రాజ్యాంగ రచన డా.బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన జరిగిందని ఆయన పేర్కొన్నరు. రాజ్యాంగ రచన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం సాగిందని దీనిని 1949 నవంబరు 26వ తేదీన ఆమోదించారని చెప్పారు. దేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యం ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అదే రోజున రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు.రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొంటూ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు. రాజ్యాంగం కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్ష లేకుండా అందరికి ఒకే న్యాయం, ఒకే తరహా హక్కులను కల్పించిదన్నారు.అందరికి ఓటు హక్కు, ఏక పౌరసత్వం కల్పించి భారతీయులు అందరూ ఒకటేనని చాటిచెప్పిందన్నారు. అల్పసంఖ్యాక వర్గాలు, గిరిజనులు, అణగారిన వర్గాలకు కొన్ని రక్షణ కవచాలను సైతం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బి.ఎన్.రావు తదితరులు రాజ్యాంగ రూపకల్పనలో విశేష కృషి చేసారని అన్నారు. ప్రాథమిక హక్కులను ప్రతి ఒక్కరికి కల్పించిందని అన్నారు. దేశ పౌరులందరికి సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని అందించాలనేది లక్ష్యమని చెప్పారు.జాయంట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను, 7 ఉపకమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. 11 సార్లు సమావేశమైందని, 115 రోజులు చర్చించి చివరకు 1949 నవంబరు 26న ఆమోదించిందన్నారు. రాజ్యాంగం ఇప్పటి వరకు 103 సార్లు సవరించి దేశానికి మార్గదర్శకాన్ని ఇస్తుందని చెప్పారు.పోలీసు సూపరింటిండెంట్ అమ్మిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం దేశానికి గొప్ప దిశానిర్దేశం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అచరించి దేశ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఏ.బార్గవతేజ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ పి.వేణుగోపాల్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఎం.చెంచయ్య, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా.కె.సాయిరాం,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 70 వ రాజ్యాంగ దినోత్సవం