శ్రీకాకుళం : నవంబరు 6: అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి తెప్పోత్సవానికి ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్య ప్రకాష్ తెలిపారు. బుధవారం ఇ.ఓ. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో తెప్పోత్సవ కార్యక్రమ నిర్వహణపై పాత్రికేయులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా నవంబరు 9వ తేదీ సాయంత్రం ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరిణిని పరిశుభ్రపరచామని, తెప్పోత్సవానికి కావలసిన ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు.గోదావరి పుష్కరాల ప్రమాదాన్ని దృష్టిలో వుంచుకుని, తెప్పోత్సవ నావలో అర్చకులు, దేవతామూర్తులు తప్ప వేరెవ్వరికీ ప్రవేశం లేదని తెలిపారు.భక్తులు దీనిని గమనించి సహకరించాలని కోరారు. గజ ఈతగాళ్ళు, ఎలక్ట్రికల్ జెనరేటర్ సిబ్బందికి మాత్రమే ఇన్సూరెన్స్ వుంటుందని,వారికి నావలోకి ప్రవేశం వుంటుందని చెప్పారు. మత్స్యశాఖ,అగ్నిమాపక శాఖలు గజ ఈతగాళ్ళను, మినీబోట్లను ఏర్పాటు చేస్తారని చెప్పారు. భక్తులకు బూందీ, పులిహోర, మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు.వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.నావికోత్సవాన్ని వీక్షించడానికి టెంట్లను ఏర్పాటు చేసామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లను సజావుగా చేసామని చెప్పారు. దేవాదాయ శాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా కోలాటం, భజన, నృత్య ప్రదర్శనలు వుంటాయన్నారు.భక్తులు కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ, ప్రతీ ఏటా కార్తీక శుధ్ధ ద్వాదశి రోజున ఇంద్రపుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.ఆషాఢ శుధ్ధ ఏకాదశి రోజన శ్రీ మహావిష్ణువు శయనిస్తాడని, ఆ రోజును శయన ఏకాదశి అని కూడా అంటారని వివరించారు.కార్తీక శుధ్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు మేల్కాంచి భక్తుల విధుల నిర్వహణను పరికిస్తాడని, ఆ రోజును ఉద్దాన ఏకాదశి అని అంటారని తెలిపారు.నరకబాధ నివృత్తికోసం ఆవు నేయి కాని ఆముదంతో కాని, నూనితో కాని దీపం వెలిగించి పుష్కరిణిలో వదిలి, భక్తులు, వారి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటారని చెప్పారు.హంసవాహనపై ఉషా, పద్మినీలతో కలిసి స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం వుంటుందన్నారు. తిరువీధి నుండి అలివెట్టి మండపంలో నక్షత్రహారతి, పూజాది కార్యక్రమాలు వుంటాయని తెలిపారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా ఆయన కోరారు.
9వ తేదీన సూర్యనారాయణస్వామి తెప్పోత్సవం