యస్.బి.ఐ.మొబైల్ యోనో యాప్ సురక్షితం

శ్రీకాకుళం : నవంబరు 26 :  యస్.బి.ఐ.మొబైల్ యోనో యాప్ సురక్షతమైనదని  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శ్రీకాకుళం  రీజనల్ మేనేజర్  కె.తేజోమయి అరవింద్ తెలిపారు. ఈ యాప్  ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  స్ధానిక రామలక్ష్మణ జంక్షన్ నుండి ఏడు రోడ్లు జంక్షన్ వరకు  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ ఖాతాదారుల ఉపయోగార్ధం రెండు సంవత్సరముల క్రితం మెబైల్ యోనో యాప్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ యాప్ కి యమ్ పిన్ మరియు పర్సనల్ సీక్రెట్ లాక్ ఉండడవల్ల  వేరేవారు ఖాతాను ఉపయోగించలేరన్నారు. ప్రస్తుతం జిల్లాలో 80 వేల మంది ఖాతాదారులు దీనిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ యాప్ ద్వారా లావాదేవిలు సులువుగా జరుపుకోవచ్చని, బ్యాంకులలో ఎక్కువ సమయం కేటాయించక్కరలేదని అన్నారు. ఖాతాదారుల  అవగాహన కోసం ప్రతి ఎస్.బి.ఐ. ఉద్యోగులు అందుబాటులో ఉంటారని చెప్పారు. యాప్ ద్వారా ఖాతాదారులు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని  తెలిపారు. ఈ యాప్ ద్వారా ఖాతాలో ఉన్న బ్యాలన్స్ లను మరియు లోను వివరాలు సులువుగా తెలుసుకోవచ్చన్నారు.  పొరపాటున  ఎ.టి.ఎం.కార్డు ఇంటి దగ్గర మరచిపోతే ఈ యాప్ ఉపయోగించి దగ్గరలో ఉన్న ఎ.టి.ఎం. ద్వారా డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు.అరసవల్లి బ్రాంచ్ మేనేజర్  బి.ఎస్.సి.శేఖర్ బ్యాంకుకు వెళ్లకుండానే ఈ యాప్ ద్వారా యాక్సిడెంటల్  ఇన్సూరెన్స్ మరియు ఎక్స్ ప్రెస్ లోనులు సుమారు 50 వేల రూపాయల నుండి 5 లక్షల వరకు ఎటువంటి హామీలు లేకుండా పొందవచ్చని తెలిపారు.ఈ యాప్ ద్వారా  గోల్డ్ లోను పెట్టుకున్నవారికి వడ్డీ తగ్గుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  శ్రీకాకుళం  స్టేట్ బ్యాంకు  బ్రాంచ్ మేనేజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.