మహనీయుడు తెన్నేటి విశ్వనాధం వర్దంతి సందర్భంలో ఆయనకోసం నాలుగు ముక్కలు...

విశాఖపట్నం : నవంబరు 10 : విలువలతో కూడిన రాజకీయాలు నెరపిన అతికొద్ది మంది ప్రజా ప్రతినిధుల్లో తెన్నేటి విశ్వనాథం ఒకరు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి నీతి, నిజాయితీలలో, పోరాట పటిమతో జీవితాంతం వ్యవహరించిన మహానుభావుడు. స్వాతంత్య్ర సమర యోధునిగా, నాటి ఆంధ్రోద్యమ నాయకునిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ప్రముఖ రచయితగా తెన్నేటి విశ్వనాధం గుర్తింపు పొందారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అని నినదించి ఆ ఉక్కు ఫ్యాక్టరీని సాధించే వరకు నిద్రపోని నాయకునిగా ఆంధ్రుల గుండెల్లో విశ్వనాథం సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు.
విశాఖప్నం జిల్లా లక్కవరంలో 1895 సెప్టెంబర్‌ తెన్నేటి విశ్వనాథం 9వ తేదీన జన్మించారు. ఎం.ఏ. బి.ఎల్‌. పట్టభద్రలు ఆయన. 1921లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకొని ప్రాక్టీసు ప్రారంభించారు. అయితే గాంధీజీ  పిలుపు మేరకు విశ్వనాధం 1922లో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. శాసనోల్లంఘన కార్యక్రమాల్లో ముందుండి అనేక ఏళ్ళపాటు జైలుశిక్షను అనుభవించారు.గుజరాత్‌ విద్యాపీఠ్‌లో ఆచార్య కృపలానీతో కలిసి అధ్యాపకునిగా కొంతకాలం పని చేసారు.1922వ సంవత్సరంలో  గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో ఉన్నపుడు కొన్నాళ్లు అక్కడే ఉండి గాంధేయవాదాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు.1924లో విశాఖ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా,1925లో ఎ.ఐ.సి.సి. సభ్యునిగా ఎన్నికయ్యారు. 1930లో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. బరంపురం, మద్రాసు, నెల్లూరు జైళ్ళలో ఈయన శిక్ష అనుభవించారు. దండి సత్యాగ్రహంలో పాల్గొని విజయనగరం నుంచి విశాఖ వరకు పాదయాత్ర నిర్వహించారు.1933వ సంవత్సరంలో  గాంధీజీ, 1936లో నెహ్రూ, 1938లో బాబూ రాజేంద్రప్రసాద్‌ విశాఖ వచ్చినప్పుడు వారు విశ్వనాధం ఇంట్లోనే బస చేశారు.1937వ సంవత్సరంలో  ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు విశాఖ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.అప్పుడు రెవెన్యూ మంత్రి అయిన టంగుటూరి ప్రకాశం వద్ద తెన్నేటి పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేసారు. 1947 నవంబరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విశాఖ పురపాలక చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1951లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీని స్థాపించారు.ఆంధ్రోద్యమంలో భాగంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకై 1952లో తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసారు.1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆర్థిక, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ సమయంలోనే ప్రకాశం బ్యారేజీ, తిరుపతిలో శ్రీ వెంక టేశ్వర విశ్వవిద్యాలయం తదితర అభివృద్ధి పనుల్లో ఆయన క్రియా శీలక పాత్రను పోషించారు. అలాగే గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయించారు. 1951-54లో నీలం సంజీవరెడ్డి తో కలసి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఎనలేని కృషి చేసి కేంద్రానికి తమ నివేదికను సమర్పించారు.
1954లో ప్రకాశం మంత్రివర్గం పడిపోయింది.1962వ సంవత్సరంలో మాడుగుల నియోజకవర్గం నుంచి మరలా  ఎన్నికయ్యారు.1971లో తెన్నేటి ఆధ్వర్యంలో ప్రధాని ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసారు.1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో ఆయన పాల్గొని మొత్తం ఆరుసార్లు అరెస్టయ్యారు.1974లో జయప్రకాశ్‌ నారాయణ నిర్వహించిన సంపూర్ణ విప్లవంలో ఆయన పాల్గొన్నారు.1975లో కేంద్ర ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని ఎదిరించారు.1975 డిసెంబర్‌ 12న ఆయనను అంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. ఆరు నెలలపాటు విశాఖ సెంట్రల్‌ జైలులో నిర్బంధించారు. జనతా ప్రభుత్వ హయాంలో ఆయనకు గవర్నరు పదవి ఇవ్వజూపి మరీ సున్నితంగా తిరస్కరించారు. అన్నింటికి మించి ఆయన ఆధునిక విశాఖ నిర్మాతగా ఎనలేని ఖ్యాతి పొందారు. ఆయన గొప్ప సాహితీ వేత్తకూడా. విశాఖ సారస్వత వేదికను ఏర్పాటు చేసి భాషా సేవ కూడా చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి గౌరవించింది.ఆ మహామనిషి 1979వ సంవత్సరం  నవంబరు 10వ తేదీన తుదిశ్వాస విడిచారు.