స్పందన ద్వారా వినతులు సత్వర పరిస్కారం

శ్రీకాకుళం : నవంబరు 4 : స్పందన వినతులను సత్వరమే పరిష్కరించాలని సంయుక్త  కలెక్టర్ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.  సోమవారం సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు  ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ వినతులను పరిష్కరించ వలసినదిగా కోరుతూ స్పందన కార్యక్రమానికి విచ్చేసారు. ముందుగా జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామం నుండి మన్నె సింహాచలం , తనకు గల ఎకరా 11 సెంట్ల భూమిని మడ్డువలస కాలువ నిర్మాణానికి తీసుకున్నందున తనకు నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. హిరమండలం బుడుమూరు గ్రామం నుండి ఆకుల అప్పల నరసమ్మ, తాను 50 సం.లుగా సాగుచేసుకుంటున్న 50 సెంట్ల భూమిని వేరే వ్యక్తులు నకిలీ పాసుపుస్తకాలు తయారు చేయించుకున్నారని ఫిర్యాదు చేసారు.  రైతు భరోసా సొమ్ము వారి బ్యాంకు ఖాతాకు జమ అయినదని, సర్వే చేయించి తన స్వాధీనంలో వున్న తన భూమికి తన పేరున పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని కోరారు.  శ్రీకాకుళం నుండి పొలుమూరు శాంతమ్మ, తనకు గల 28 సెంట్ల భూమికి సంబంధించి, అడంగల్ లో తప్పులు నమోదు అయినందున వాటిని సరిచేయాలని కోరారు.  ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు గ్రామం నుండి బొంతల రామారావు, తనకు ఎస్.సి.కార్పోరేషన్ ద్వారా ఆటో కొనుగోలుకు సంబంధించిన రుణాన్ని మంజూరు చేయాలని కోరారు. వీరఘట్టం మండలం నుండి బోగి జనార్థన రావు, ఇన్ ఏక్టివేట్ అయిన తన రేషన్ కార్డును ఏక్టివేట్ చేయించవలసినదిగా కోరారు. ఎల్.ఎన్.పేట మండలం మల్లిఖార్జున పురం గ్రామం నుండి గుడివాడ భాస్కరరావు, తనకు రైతు భరోసా పథకాన్ని మంజూరు చేయాలని కోరారు. లావేరు మండలం నుండి ఎం.భానోజీరావు,  తమ గ్రామం చిన మురపాక 26 సం.ల క్రిందట చిన్న మురపాక పంచాయితీగా ఏర్పడినదని కావున సదరు గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని కోరారు.  సంబంధిత శాఖాధికారుల ద్వారా సత్వరమే సమస్యలను పరిష్కరించనున్నట్లు  సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు  తెలిపారు.