ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

శ్రీకాకుళం : నవంబరు 7 : ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస క్యాంపు కార్యాలయంలో సభాపతి గురు వారం స్పందన కార్యక్రమంను నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో ముందుంటామని ప్రజలకు భరోసా కల్పించారు. ఆమదాలవలస నియోజకవర్గంతోపాటు పలు ప్రాంతాల నుండి ప్రజలు వినతులను సమర్పించారు. అగ్రీ గోల్డు డిపాజిటుదారులతోపాటు వివిధ సమస్యలపై ఆర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. స్పందన కార్యక్రమంను ప్రాధాన్యతను ఇచ్చి ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగిందని సభాపతి తెలిపారు. సామాజిక సమస్యలు మాత్రమే కాకుండా వ్యక్తిగత సమస్యలపైనా దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. వ్యక్తిగత సమస్యలను పరిగణనలోకి తీసుకోవడంలో ప్రాధాన్యతను ఇస్తామని ఆయన స్పష్టం చేసారు. అధికార యంత్రాంగం పారదర్శకంగా సమస్యలను పరిష్కరించుటకు కృషి చేయాలని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనం వహించే కార్యక్రమం స్పంధన కార్యక్రమం అన్నారు. వినతులలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలను విభజించాలని తదనుగుణంగా త్వరితగతిన పరష్కరించుటకు అవకాశం కలుగుతుందని సీతారాం పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారంలో పైరవీలు లేవని స్పష్టం చేసారు. ప్రతి వ్యక్తి సమస్య పరిష్కారం కావాలనే గట్టి సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం అన్నారు. ప్రతి 15 రోజులకు గురువారం రోజున స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఆయన అన్నారు. అందిన ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఉండాలని ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల్లో సంతృప్తి కలగాలని పేర్కొన్నారు. అందిన వినతులపై సమీక్షలు నిర్వహించి సకాలంలో నాణ్యమైన పరిష్కారం ప్రతి ఆర్జీకి లభించే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా ప్రతి మండలానికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేసి ప్రజల నుండి వినతులను నమోదు చేసారు.ఈ స్పందన కార్యక్రమంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు బి.రాంబాబు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ పి.వేణుగోపాల్, వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు కె. శ్రీధర్, సహాయ సంచాలకులు ఆర్.రవి ప్రకాష్,  తహశీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.