శ్రీకాకుళం : నవంబరు 13 : ఆడపిల్లలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో వై.ఎస్.ఆర్.కిశోరీ వికాసం 3వ విడత కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కిశోరీ వికాసం కార్యక్రమం ఆడపిల్లల మనుగడకు,వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపడం ఆవశ్యకమని తెలిపారు.ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలు సైతం చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇటీవల మన జిల్లాలో తల్లి తిట్టిందని బాలిక ఆత్మహత్య చేసుకుంది. దానిని తట్టుకోలేక తల్లి రెండు రోజుల తరువాత మరణించిందని, వీరికి సరైన సమయంలో వారి బాధలను విని, ధైర్యాన్ని కలుగచేసే వ్యక్తులు వున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు తగ్గుతాయన్నారు.వీరి కన్నా పెద్ద తరగతుల విద్యార్ధులు నచ్చచెపితే వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుందన్నారు. ఒకే వయసుగల సభ్యులు అవగాహన కలిగించడం వలన ఆ వయస్సు వారికి త్వరగా చైతన్యం కలుగుతుందన్నారు. లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టవలసిన ఆవశ్యత ఎంతైనా వున్నదని, చిన్నతరగతుల నుండి, మంచి చెడులపై అవగాహన కలిగించాలని అన్నారు. పిల్లలు సమాజంలో ఇతర సమస్యలను, వేధింపులను ఎదుర్కొంటున్నారని, వీరికి చట్టాలపై అవగాహన కలిగించాలని, వేధింపులు, ఆరోగ్య, సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొనే పద్ధతులను వివరించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను తెలియజేసి వాటి ద్వారా ప్రయోజనం పొందేవిధంగా సహకరించాలని చెప్పారు. అమ్మ ఒడి, ఉపకార వేతనాలు వంటి పథకాలు ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదవవచ్చునని వీరికి అవగాహన కలిగించాలన్నారు.15 నుండి 49 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికలు, మహిళల్లో 60 శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారని, జిల్లాలో 20 శాతం మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. జిల్లాలో నాంది కార్యక్రమం ద్వారా పోషక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మహిళలు ఉద్యోగాలు సాధించే విధంగా అవగాహన కలిగించాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తల్లితండ్రులు పిల్లలకు భరోసాను, నమ్మకాన్ని కలిగించవలసిన అవసరం వుందన్నారు.
ఆడది ఆదిపరాశక్తి : జిల్లా కలెక్టరు నివాస్