విజయనగరం :నవంబరు 17 : గరుగుబిల్లి మండలం నాగూరు వద్ద నాగావళినదిలో శుక్రవారం స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ ప్రవాహంలో కొట్టుకుపోయిన బొంతు ఆదినారాయణ నాయుడు(51) మృతదేహం ఒక తర్వాత లభ్యమైంది. శనివారం ఉదయం నుంచి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాలన్నింటి గాలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అర కిలోమీటరు దూరంలోని పవర్‌ప్లాంటు గేటు వద్ద ఈ రోజు సాయంత్రం మృతదేహం లభ్యం కావడంతో బయటకు తీశారు. నదికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తానని చెప్పిన భర్త శవమై కనిపించడంతో మాకు దిక్కెవరంటూ భార్య వెంకటలక్ష్మి, కుమారుడు రాజేశ్ విలపించారు.
ఎస్.ఐ. వై.సింహాచలం, వీఆర్వో నాగేశ్వరరావు గ్రామపెద్దల సమక్షంలో వివరాలు సేకరించి మృతదేహాన్ని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగావళి నదిలో గల్లంతైన ఆదినారాయణ మృతదేహం లభ్యం