శ్రీకాకుళం : నవంబరు 20 : మెరుగైన వైద్య సేవలను అందించి,ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్యాధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశమందిరంలో వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో బయోమెట్రిక్ అమలు, ఆసుపత్రి నిధుల వినియోగం, ఆసుపత్రి ప్రసవాలు, సీజనల్ వ్యాధులు, మాతాశిశు మరణాలు, తదితర అంశాలపై సమీక్షించారు.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోను, సామాజిక ఆరోగ్య కేంద్రాలలోను, ఏరియా ఆసుపత్రులలోను సమయపాలన పాటించాలని, తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు.ఆసుపత్రిలోని యావన్మంది సిబ్బంది తప్పని సరిగా బయోమెట్రిక్ వేయాలన్నారు.ఆసుపత్రులకు సరఫరా చేసిన ఎ.సి.లను త్వరితగతిన అమర్చాలని, ఆసుపత్రులలో గోడలకు మంచి పెయింటింగ్ చేయించడం, మంచినీరు అమర్చడం, టాయ్ లెట్ సదుపాయాలు కలుగచేయడం, పరిసరాలను పరిశుభ్రంగా వుంచడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇ-సబ్ సెటర్లు, ఇ-వెల్ నెస్ సెంటర్లలో ఎ.టి.ఎం. మందుల మెషీన్ల ఏర్పాటుపై శ్రధ్ధ వహించాలన్నారు. ఈ నెల 22, 23 తేదీలలోగా గ్రామ సచివాలయాల ఎ.ఎన్.ఎం. ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. గ్రామ సచివాలయాలకు కొత్తగా నియమించబడిన ఎ.ఎన్.ఎం.లకు మంచి శిక్షణను ఇవ్వాలన్నారు.గ్రామ స్థాయిలో మంచి వైద్య సేవలను అందించడానికి తర్ఫీదు నివ్వాలన్నారు. గర్భిణీలకు వైద్యపరీక్షలను సక్రమంగా నిర్వహించాలన్నారు. గర్భం ధరించిన 12 వారాలలోగానే వైద్య పరీక్షలు ప్రారంభించాలన్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ బారిన పడకుండా వారికి సకాలంలో మంచి వైద్యం అందించాలని తెలిపారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన క్రింద గర్భం ధరించిన నాటి నుండి ప్రసవం జరిగేవరకు 3 విడతలలో 5 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సాంకేతిక లోపాలను సరిచేసి, గర్భిణీలకు ఈ పథకం వర్తింప చేయాలన్నారు.ఆసుపత్రి అభివృధ్ధి నిధులను సక్రంగా ఆసుపత్రి అభివృధ్ధికి వినియోగించాలని తెలిపారు. మాతృ మరణాలు, శిశు మరణాల నివారణకు పనిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టలన్నారు. వైద్యాధికారులు మంచి వైద్య సేవలను అందించి ప్రజల ఆరోగ్యానికి కృషి చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎం.చంచయ్య, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు, అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి బగాది జగన్నాధరావు, డా.నరేశ్ కుమార్, డా.ఎల్. రామ్మోహన్ రావు, డా.మెండ ప్రవీణ్, డా.కె.కృష్ణమోహన్, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ సి.హెచ్.సి, పి.హెచ్.సి, ఏరియా ఆసుపత్రుల వైద్యాధికారులు, తదితరులు హాజరైనారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టరు