ఇరిగేషన్ పనులను తొందరగా పూర్తి చేయాలి : మంత్రి ధర్మాన

శ్రీకాకుళం : నవంబరు 8: ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు  ధర్మాన క్రిష్ణ దాస్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ వారి సమావేశ మందిరంలో జిల్లాలోని జలవనరుల పనులపై సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయానికి 7.62 ఎకరాల భూమికి నీటి పారుదల అవసరమన్నారు. ప్రభుత్వం అత్యంత  నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదని తెలిపారు.జాప్యం జరిగితే ఖర్చులు పెరుగుతాయని, నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.  ఆయకట్టు పనులను పూర్తి చేయాలని, పునరావాస కాలనీలలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పునరావాస కాలనీలలో పనులకు ఇసుక కేటాయిస్తామని చెప్పారు. పనులు జాప్యం జరిగితే రైతులు నష్టపోతారని, నిధులుతీసుకురావడానికి కృషి చేయనున్నామని తెలిపారు  ప్రభుత్వానికి, జిల్లాకు ప్రయోజనకరంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ పనులు, భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పరిస్ధితులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు బి.ఆర్.ఆర్.వంశధార ప్రాజెక్టు ఫేజ్-2, స్టేజ్-2 పనులు, ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు, వంశధార, నాగావళి నదుల అనుసంధానం, ప్యాకేజీ 87,88 మరియూ హిరమండలం రిజర్వాయరు పనులు 80 శాతం పూర్తి కాబడినట్లు  అధికారులు తెలిపారు. 2020, జూన్ నెలాఖరునాటికి బ్యాలన్స్ పనులను పూర్తి చేయాలని, మంత్రివర్యులు ఆదేశించారు. ఆఫ్ షోర్ రిజర్వాయరు పనులకు కొత్త టెండర్లను పిలిచి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం వంశధార కరకట్టల పనుల నిమిత్తం రూ.155 కోట్లు మంజూరు కాబడినదని,  వంశధార ప్యాకేజీ  25 శాతం కన్నా తక్కువ పనులు జరిగినందున ప్రభుత్వం వద్ద రివ్యూలో వున్నదని,నాగావళి పనులు పురోగతిలో వున్నట్లు ఇంజనీరింగ్ అధికారి తెలపారు.పాత కాలువ ఆధునికీకరణ నిమిత్తం రూ. 170 కోట్లు మంజూరైనదని, పనులు ప్రారంభించడం జరిగిందని, నారాయణపురం  ఆయకట్టు నిమిత్తం రూ. 112 కోట్లు మంజూరయ్యాయని  ఈ పనులు కూడా ప్రభుత్వం వద్ద రివ్యూలో వున్నాయని వివరించారు. మడ్డువలస కొత్తఆయకట్టు స్థిరీకరణ  నిమిత్తం రూ.4 కోట్లు మంజూరు కాగా, భూసేకరణ చెల్లింపులు పెండింగ్  వున్నాయని ఎస్.ఇ. వివరించారు.మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయరు పనులు , ఆర్.అండ్.ఆర్. కాలనీ పనులపై  మాట్లాడుతూ, రహదారులు, నీటి సరఫరా, వీధి లైట్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. పంచాయితీ భవనాలు, పాఠశాల, అంగన్వాడీ భనవాలను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలన్నారు. ఆర్.డబ్ల్యు.ఎస్. వాటర్ హెడ్ ట్యాంకులు, ఎలక్ట్రిఫికేషన్ పనులపై శ్రధ్ధ వహించాలన్నారు. ఇ.డబ్ల్యు.ఐ.డిసి. తమ పరిధిలోగల పునరావాస కోలనీలలో చేపడుతున్న పనులను వివరించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, పునరావాస కాలనీలలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తోటపల్లి పాత రెగ్యులేటరీ పనులను పూర్తి చేయాలని ఆదేశించారుఈ సమావేశానికి, సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎ.భార్గవ తేజ,  సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు, ఇరిగేషన్ ఎస్ఇ. రాంబాబు, ఇ.డబ్లయ్యు.ఐ.డి.సి. కె.భాస్కరరావు, హౌసింగ్ పి.డి. టి.వేణుగోపాల్, భూసేకరణ అధికారులు, తదితరులు హాజరైనారు.