శ్రీకాకుళం : నవంబరు 30 : శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఆదాయాన్ని పెంచాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ నగరపాలక సంస్థ అదికారులను ఆదేశించారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ (ఎస్ఎంసి) పనితీరును జిల్లా కలెక్టర్ మరియు ఎస్ఎంసి ప్రత్యేక అధికారి జె నివాస్ సమీక్షించారు. ఈ సంధర్బంగా ఆయన నగర పాలక సంస్థ పనితీరును సమీక్షిస్తూ నూతన నిర్మాణాలు వాటి పన్నుల చెల్లింపుపై దృష్టి సారించాలని, ఆస్తి పన్ను వసూలు వసూలు ద్వారా ఎస్ఎంసి ఆదాయాన్ని పెంపొందించాలన్నారు.ఆస్తి పన్ను చెల్లింపుదారులు, చెల్లింపు వివరాలు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. తాగునీటి సరఫరా , ముఖ్యంగా వర్షాకాలంలో, సంతృప్తికర స్థాయిలో ఉండాలని,నీటి సరఫరాలో నాణ్యత పెరగాలని ఆయన తెలిపారు.లభ్యంగా ఉన్న నిధులతో ప్రాంతం వారీగా నాణ్యత పెంపు చర్యలు చేపట్టాలన్నారు.14వ ఆర్ధిక సంఘం నిధులతో తగిన పనులు చేపట్టాలని,తక్కువ ఖర్చుతో ఇంటింటికి కొళాయి కల్పించుటకు గల అవకాశాలను అంచనా వేసి నివేదిక సమర్పించాలని కలెక్టరు తెలిపారు.సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా జరగాలని, కమీషనర్ పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు.పొడి చెత్త, తడి చెత్తను వేరు చేయాలని, బయో గ్యాస్ ఏర్పాటుపై సత్వర చర్యలు చేపట్టాలని తెలిపారు.డైక్ నిర్మాణాన్ని ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని, లేదంటే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు.ప్రతి నెల ప్రగతి పరిశీలిస్తామని తెలిపారు.నవభారత్ కూడలి నుండి 7 రోడ్ల కూడలి వరకు రహదారి పనులు చేపట్టాలని, రహదారి విస్తరణకు అవాంతరంగా ఉన్న నిర్మాణాలపై దృష్టి సారించాలని కలెక్టరు తెలిపారు.ఎస్ఎంసి కమీషనర్ ఎం.గీతాదేవి మాట్లాడుతూ దాదాపు 830 నూతన నిర్మాణాలు గుర్తించినట్లు తెలిపారు. రూ.11 కోట్లు పన్ను వసూలు కావాలని, వేతనాల చెల్లింపుకు నెలకు రూ.1.50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. సమావేశంలో ఎస్ఎంసి సహాయ కమీషనర్ కె. శివప్రసాద్, ఇంజినీర్ కె. వి.రమణ మూర్తి, దక్షిణా మూర్తి, ఆరోగ్య అధికారి వెంకట రావు, ప్రజా ఆరోగ్య ఇంజినీర్ పి.సుగుణాకర రావు, ఏసిపి దేవ కుమార్, ఇపిడిసిఎల్ ఏడిఇ కమల్ హాసన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఆదాయాన్ని పెంచాలి : కలెక్టరు నివాస్