క్రీడాకారులకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా : స్పీకర్ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం : నవంబరు 3: అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని రాష్ట్రశాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం కోడి రామమూర్తి 138 వ జయంతి సందర్భంగా   స్పీకర్ తమ్మినేని సీతారాం,  రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు  ధర్మాన కృష్ణదాస్ తో కలిసి కోడి రామమూర్తి స్టేడియం వద్ద గల కోడి రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, కోడిరామమూర్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్లయోధుడని, ఆయన మన జిల్లాలో జన్మించడం  మనందరికీ గర్వకారణమని అన్నారు. కలియుగ భీముడుగా పేరు గాంచిన ఆయనకు భారతరత్న బిరుదును ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందన్నారు.  ముఖ్యమంత్రి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.   స్పోర్ట్స్ కేలెండర్ ను క్రీడాకార్యక్రమాలలో రూపొందించవలసిన ఆవశ్యకత వుందన్నారు. కోడి రామమూర్తి వంటి ప్రపంచప్రఖ్యాతి గాంచిన వారిని భావితరాల వారు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ, తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి కోడి రామమూర్తినాయుడు అని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోడి రామమూర్తి  మన జిల్లావాసి కావడం ఆనంద దాయకమన్నారు. ఆయన  138 వ జన్మదినాన ఆయనకు ఘన నివాళులర్పించడం హర్షదాయకమని అన్నారు. క్రీడా ప్రాంగణాన్ని ఆయన పేరుతో నిర్మించడం జరిగిందని,   అతి త్వరలోనే ప్రాంగణం పునర్నిర్మాణాన్ని పూర్తి చేయనున్నామని చెప్పారు. క్రీడలను, క్రీడాకారులను  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు.  శ్రీకాకుళంలో సి.ఎం.కప్ వాలీబాల్, షటిల్ టోర్నమెంటులు నిర్వహించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మన జిల్లానుంచి  ప్రపంచస్థాయి క్రీడాకారులు ఆవిర్భవించాలన్నారు.ఈ కార్యక్రమానికి  సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, సెట్ శ్రీ సి.ఇ.ఓ. శ్రీనివాసరావు, డి.ఎస్.డి.ఓ. శ్రీనివాస్ కుమార్, తాశీల్దార్ ఐ.టి.కుమార్, డిప్యూటీ తహశీల్దార్  సతీష్ తదితరులు హాజరైనారు.