అసంఘటిత కార్మికుల పింఛను పథకం : శాసన సభ్యులు ధర్మాన

శ్రీకాకుళం : నవంబరు 30 : అంఘటిత కార్మికుల పింఛను పథకం ద్వారా లబ్దిపొందాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు అసంఘటిత కార్మికులకు పిలుపునిచ్చారు.శనివారం స్ధానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో  ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ వారోత్సవాల కార్యక్రమాన్ని కార్మిక శాఖ నిర్వహించింది. కార్యక్రమం  సంయుక్త కలెక్టర్-2 అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా  శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు  విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు  మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం   ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఈ నెల 30 నుండి డిశంబరు 6వ తేదీ వరకు వారోత్సవార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అధికారులు లబ్దిదారులకు పథకాలపై అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు.ఈ పథకం ద్వారా వర్తకులకు నూతన పథకం, అసంఘటిత కార్మికులు మరియు చిరు  వ్యాపారులకు పింఛను పథకాన్ని వర్తింప చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా హొటళ్ళలో పనిచేసే వారు, తోపుడు బండి ద్వారా చిరు వ్యాపారం చేసుకునే వారు, హమాలీలు, ఇంటి పని వారు సైతం లబ్ది పొందవచ్చునని తెలిపారు.ముఖ్యంగా మన జిల్లాలో అధిక సంఖ్యలో అసంఘటిత కార్మికులు  వున్నారని తెలిపారు.ఉపాధి కోసం వలస వెళ్ళే వారు కూడా అధికంగా వున్నారని తెలిపారు.వలసల నివారణకోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టిందని తెలిపారు.18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కల  అసంఘటిత కార్మికులంతా ఈ పథకంలో నమోదు కావాలన్నారు.  లబ్దిదారుల వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు చెల్లించవలసి వుంటుందన్నారు. వృధ్ధాప్య దశలో  60 సం.ల తర్వాత ప్రతీ నెల  మూడు వేల రూపాయల  పింఛనును పొందవచ్చునని తెలిపారు.వృద్ధాప్య దశలో  ఈ పింఛను ఎంతో ఉపయోగపడుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందే పింఛనుతో పాటు ఈ పింఛనును కూడా పొందవచ్చునని తెలిపారు.  పింఛనుదారుడు మరణించిన సందర్భంలో అతని భాగస్వామికి రూ.1500 లు నెలవారీ పింఛను మంజూరు కాబడుతుందన్నారు. స్వయం శక్తి సంఘ సభ్యులు, గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్దిదారులను గుర్తించి వారిని ఈ పథకంలో చేర్పించాలని అధికారులకు శాసన సభ్యులు  సూచించారు.  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిజాయితీపాలన అందిస్తున్నారని పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అంధవరపు వరాహ నరసింహం మాట్లాడుతూ, ప్రతీ నిరుపేద కుటుంబం లబ్ది పొందే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అసంఘటిత కార్మికులంతా ఈ పథకంలో నమోదయి, పూర్తి లబ్ది పొందాలని తెలిపారు.  అనంతరం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పింఛను పథకంలో నమోదు చేసుకున్న సూర్యకుమారి, పార్వతిలకు ధృవీకరణ పత్రాలను అందించారు.ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ ఉప కమీషనరు ప్రసాదరావు, సహాయ కమీషనర్లు రాధాకుమారి, పురుషోత్తం, మెప్మా పి.డి. కిరణ్ కుమార్, పట్నాల శ్రీను, గొండు రఘురాం, గొండు కృష్ణమూర్తి, మాజీ మున్సిపల్ వైస్.చైర్ పర్సన్ అలివేలు మంగ, వివిధ కార్మిక సంఘ నాయకులు, తదితరులు హాజరైనారు.