రాష్ట్రంలో ఇసుక కొరత తీరింది:

విశాఖపట్నం : నవంబరు 11: గత ప్రభుత్వ హయాంలో 'ఉచిత ఇసుక' పేరుతో జరిగిన మాఫియా దోపిడీని నిరోధించి, ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందించాలని, అదే సమయంలో వాల్టా నిబంధనల ప్రకారం నదులను సంరక్షించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గత ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా ఈసారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రుతుపవనాలు, తుపానుల ప్రభావంతో వర్షాలు అధికంగా కురిశాయి. దీంతో నదులన్నీ వరదతో పొటెత్తాయి. దాదాపు రెండు నెలల పాటు నిండుగా ప్రవహించాయి.గత పదేళ్లలో ఎప్పుడూలేని విధంగా జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకుఆటంకం ఏర్పడింది. తాజాగా బుల్‌బుల్‌ తుపాను గండం తప్పడంతో వరద మళ్లీ వచ్చే అవకాశం కూడా లేదు.నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. విశాఖ అవసరాల కోసం కేటాయించిన గోదావరి నదిలో రెండు రీచ్‌లు, శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రతి రోజూ సగటున 4 వేల నుంచి 5 వేల టన్నుల ఇసుక జిల్లాకు వస్తోంది.విశాఖ  ప్రాంతాల్లో భవన నిర్మాణాల కోసం ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌లను ప్రభుత్వం కేటాయించింది. పెదసవలాపురం, యరగాం, చవ్వాకులపేట రీచ్‌లను బల్క్‌ కొనుగోలుదారుల కోసం, గోపాలపెంట, మడపాం రీచ్‌లను రిటైల్‌ అవసరాల కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి, కాటవరం రీచ్‌లను బల్క్,రిటైల్‌ వినియోగదారుల కోసం కేటాయించారు.రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. విశాఖ నగర శివారు ముడసర్లోవ, అగనంపూడితో పాటు రూరల్‌లో నక్కపల్లి, నర్సీపట్నంలో ప్రస్తుతం ఇసుక స్టాక్‌యార్డులు నిర్వహిస్తున్నారు. చోడవరం, అనకాపల్లిలో ఏర్పాటు కోసం స్థలాన్వేషణ ఒకటీ రెండు రోజుల్లో కొలిక్కి రానుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో 8,076  టన్నులు, ముడసర్లోవలో 14,227 టన్నులు, నక్కపల్లిలో 650 టన్నులు, నర్సీపట్నంలో 85 టన్నులు,ఇలా దాదాపు 23 వేల టన్నుల మేర ఇసుక నిల్వ ఉందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యార్డుల్లో ఇప్పటివరకు 69,846 టన్నుల ఇసుక విక్రయాలు జరిగాయి.