శ్రీకాకుళం : నవంబరు 22 : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధలో భర్తీ చేసే ఉద్యోగాలకు రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని చిన్నయ ఆదివాసి వికాస సంఘం (సి.ఎ.వి.ఎస్) రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమీషన్ కు వినతి పత్రం సమర్పించింది. శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎస్.సి, ఎస్.టి కమీషన్ ఛైర్మన్ డా.కారెం శివాజి ఎస్.సి, ఎస్.టి సంఘాలు, వ్యక్తులు నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సి.ఎ.వి.ఎస్ మరియు 5వ షెడ్యూలు సాధన కమిటి అధ్యక్షులు పడాల భూదేవి వినతి పత్రాన్ని సమర్పిస్తూ దాదాపు 450 మంది నకిలీ బెంతు ఒరియా కులస్తులు ఎస్.టి ధృవీకరణ పత్రం పొంది కోర్టు స్టే తెచ్చుకుని ఉద్యోగాలలో కొనసాగుతున్నారని తెలిపారు. ఈ ఎస్.టి ధృవీకరణ పత్రాలను రద్దు చేసి, ఉద్యోగాల నుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో 540 నాన్ షెడ్యూల్డుగా ఉన్న గ్రామాలను షెడ్యూల్డు గ్రామాలుగా ప్రకటించుటకు, అటవీ హక్కుల చట్టం క్రింద రిజర్వు ఫారెస్టులో ఉన్న గ్రామాలకు సంప్రదాయ సరిహద్దులను గుర్తించి, ఉమ్మడి హక్కులు కల్పించాలని, ఆ గ్రామాలను రెవిన్యూ గ్రామాలుగా గుర్తించాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని,12 సంవత్సరాలుగా ఆదివాసీ పంటలు, ఆస్తులు, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఏనుగులను వెంటనే తరలించి ఆదివాసులను ఆదుకోవాలని., బోయ వాల్మికి, అగ్రవర్ణ కులాలను ఎస్.టి జాబితాలో చేర్చరాదని వినతి పత్రంలో కోరారు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకొనుటకు ప్రతి ఐటిడిఏలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ఆదివాసీలకు న్యాయ సహాయం అందించడానికి ఐటిడిఏల్లో ఎస్.టికి చెందిన ఒక న్యాయవాదిని న్యాయ సలహాదారుగా నియమించాలని ఆమె కోరారు.
ఐ.టి.డి.ఎ లో ఉద్యోగాలు భర్తీకి రోష్టర్ విధానం రద్దు చేయాలి