మనోవిఙ్ఞానానికి పుస్తక పఠనం మంచి సాధనం : మంత్రి ధర్మాన

శ్రీకాకుళం : నవంబరు 20 : వ్యక్తిత్వవికాసానికి పుస్తక పఠనం ఆవశ్యకమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం, జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల  ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమం సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజా అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా  రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ, విజ్ఞ్నానాన్ని అందించే మంచి సాధనం పుస్తకమని అన్నారు.  పిల్లలు గ్రంధాలయానికి వచ్చి విజ్ఞ్నానాన్ని అందించే పుస్తకాలను చదివి మంచి పౌరులుగా ఎదగాలన్నారు.  రోజులో కనీసం ఒక గంట కాలాన్ని పుస్తకపఠనానికి కేటాయించాలన్నారు.  సెల్ ఫోన్ వాడకాన్ని అవసరం మేరకు మాత్రమే పరిమితంగా వాడుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధులకు ఉన్నత స్ధాయి ఉద్యోగాలను పొందాలనేది ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఇందు నిమిత్తం, ప్రభుత్వ పాఠశాలలలో  ప్రైమరీ స్థాయి నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధనను ప్రవేశ పెట్టనున్నారని తెలిపారు. అందరికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు.  పరిశ్రమలలో  75 శాతం ఉద్యోగావకాశాలు స్థానికులకు కల్పించాలనే చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.  ముఖ్యమంత్రి పదవి చేపట్టిన   నాలుగు నెలలలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఉద్యోగ నియామకాలను   పారదర్శకంగా చేస్తున్నారని చెప్పారు. పిల్లలు బాగా చదువుకుని జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.  సంయుక్త కలెక్టర్ 2 ఆర్.గున్నయ్య మాట్లాడుతూ, ఈ రోజు తాను  ఈ స్ధాయికి చేరుకోవడానికి గ్రంధాలయమే ముఖ్య కారణమని తెలిపారు. గ్రంధాలయానికి ప్రతీ రోజు వచ్చి చదువుకోవడం ద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగానని  చెప్పారు. స్వాతీ సోమనాధ్ మాట్లాడుతూ, ఒక మంచి పుస్తకం మంచి స్నేహితునితో సమానమని, రోజుకొక గంట సేపు పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు.ఎచ్చెర్ల మండలం, ముద్దాడ పంచాయితీ నుండి విచ్చేసిన రమణారావు అనే పాఠకుడు మాట్లాడుతూ, తాను గ్రంధాలయానికి వచ్చి పోటీ పరీక్షల పుస్తకాలను చదువుకుంటున్నట్లు తెలిపారు.  తాను పంచాయితీ సెక్రటరీ పోస్టుకు సెలక్ట్  అవడానికి పుస్తక పఠనమే కారణమన్నారు. ఐస్వర్య అనే పాఠకురాలు తాను కూడా సచివాలయ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగిందని, ఇందుకు కారణం లైబ్రరీలోని పుస్తకాలను చదువుకోవడమేనని తెలిపారు.అనంతరం 10 వ తరగతి చదువుతున్న  సిధ్ధార్థ పాఠశాల విద్యార్థి, గ్రంధాలయం ఆవశ్యకతపై ఆంగ్లంలో మాట్లాడడం జరిగింది. మొబైల్ లైబ్రరీల ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన ఐశ్వర్యను అభినందిస్తూ, మంత్రి  ఆమెకు  జ్ఞాపికను బహుకరించారు.వ్యక్తృత్యపు పోటీలు, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్ధులకు జ్ఞాపికలు బహూకరించారు.సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది.ఈ కార్యక్రమంలో డా.ఇ.సంపత్ కుమార్,  నటకుల మోహన్ రావు,అంధవరపు సూరిబాబు, ఎల్.నందికేశ్వరరావు, సురంగి మోహనరావు, ఎన్.ధనంజయరావు, కె.శ్రీనివాసరావు, తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ లైబ్రేరియన్లు జి.తిరుమల కుమారి, ఎస్.వి.రమణ మూర్తి, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులు, తదితరులు హాజరైనారు.