రాష్ట్రానికి చలికాలం ఆలస్యం

విశాఖపట్నం : నవంబరు 9 : బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో చలి ప్రభావం ఇంకా మొదలు కాలేదని వాతావరణ విభాగ అధికారులు తెలిపారు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటినుంచే చలి ప్రభావం కనిపిస్తుంది.గత నెల 16వ తేదీ తర్వాత ఈశాన్య పవనాలు వచ్చినా అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపం నుంచే రెండు తుపాన్లు మొదలవడం, తాజాగా బంగాళాఖాతంలో బుల్‌బుల్‌ అతితీవ్ర తుపాను కొనసాగుతుండటం వీటి నేపథ్యంలో చలిగాలుల ప్రభావం కనిపించడం లేదని వివరించారు.ఉత్తరాంధ్రలోని విశాఖ,తుని ప్రాంతాల్లో మినహా మిగిలినచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండటం,లేదా పెరగటం కనిపిస్తోంది. ఆ రెండు ప్రాంతాల్లో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 2.6 డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి. రాయలసీమలో మాత్రం సాధారణంకన్నా 1 నుంచి 3 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. బంగాళాఖాతంలో తుపాను ప్రభావం మరో 3 రోజులు ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఆ తర్వాతే చలి గురించి అంచనాలు వేయొచ్చని చెప్పారు.