శ్రీకాకుళం : నవంబరు 8: జిల్లాలో ధాన్యం కొనుగోలు పెద్ద ఎత్తున చేపట్టి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా సంయుక్త కలక్టరు కె. శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం స్థానిక బాపూజీ కళా మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి 13 వ తేదీవరకు 6 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను జాయింటు కలక్టరు ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి నాట్లు విస్తారంగా వేసారని, పెద్ద ఎత్తున దిగుబడులు వచ్చే అవకాశముందని తెలిపారు. జిల్లాలో సుమారు 9 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేయాలని, తద్వారారైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై విస్త్రత ప్రచారం కల్పంచాలని, రైతులకు అవగాహన పెంచాలని తెలిపారు. ధాన్యంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించుట ద్వారా వారి పంటకు మంచి ధర కల్పించవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 152 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 12 నుండి అవి ప్రారంభమవుతాయని తెలిపారు. మొదటి వారంరోజులలో రైతుల నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన పరికరాలు, రవాణా ఏర్పాట్లు, ధాన్యం నిల్వకు అవసరమైన గిడ్డంగి తదితర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. టెక్నికల్ అసిస్టెంటు మేనేజరు గణేష్ కుమార్ ధాన్యం కొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తలు, రైతులకు యివ్వవలసిన సూచనలు గురించి సిబ్బందికి వివరించారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఎ.కృష్ణారావు, కాకినాడ జోనల్ కార్యాలయ అసిస్టెంటు డైరెక్టరు(టెక్నికల్) ఆర్.తనూజ, సివిల్ సప్లయి డిప్యూటీ తహశీల్దార్లు రాజు, శ్రీను, హైమావతి, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు చేసి రైతులకు కిట్టుబాటు ధర కల్పించాలి