శ్రీకాకుళం : నవంబరు 29 : మహిళలకు కిశోరీ దశ అత్యంత కీలకమైనదని జిల్లా మహిళ మరియు శిశు అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు జి.జయదేవి పేర్కొన్నారు. శుక్రవారం, జిల్లా మహిళా సమాఖ్య భవనంలో వై.ఎస్.ఆర్. కిశోరీ వికాసం ఫేజ్-3 క్రింద నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పి.డి. విచ్చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో కౌమారీ దశ అత్యంత కీలకమైనదన్నారు.ఈ దశలో వచ్చే శారీరిక మార్పుల ద్వారా మానసిక ధోరణిలో మార్పులు వస్తాయన్నారు. మంచి లేదా చెడు మార్గంలో నడవడానికి ఈ దశ పునాది అన్నారు. కౌమారీ బాలికలు, బాలురకు సైతం హక్కులు, బాధ్యతలు, ఇతర సామాజిక విషయాలపై అవగాహన కలిగించ వలసిన ఆవశ్యకత వుందన్నారు. వారికి విద్యాహక్కు, బాల్యవివాహాల ద్వారా వచ్చే అనర్ధాలు, తదితర విషయాలపై అవగాహన కలిగించవలసిన ఆవశ్యకత వుందన్నారు. ముఖ్యంగా కిశోరీ బాలికలు రక్తహీనతను అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారం, బాల్యవివాహాల వలన కలిగే అనారోగ్య సమస్యలు, మంచి స్పర్శ, చెడు స్పర్శల వివరాలు, తమ హక్కులపై వున్న చట్టాలు, సమాజంలో ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, వాటినుండి రక్షణ పొందే విధానం, ప్రలోభాల ద్వారా జీవితాలు ఏ విధంగా నాశనం కాబడుతాయి అనే విషయాలపై అవగాహన కలిగించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కిశోరీ బాలలపై శ్రధ్ధ తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. 10 నుండి 18 సంవత్సరాల బాల బాలికలు,పాఠశాలలు, కళాశాలలలోని విద్యార్ధులు కిశోరీ బాలల క్రిందకు వస్తారని తెలిపారు.వీరికి అవగాహన కలిగించే విధానంపై జిల్లా స్థాయి రీసోర్స్ పర్సన్ కు అవగాహన కార్యక్రమం జరిగిందని, ఈ కార్యక్రమంలో సి.డి.పి.ఓ.లు, ఎన్.జి.ఓ.లు, మహిళా వైద్యులు, లాయర్లు, పోలీసు అధికారులు, కాలేజీ లోని వుమెన్ ఎంపవర్ మెంట్ సెల్ సోషల్ ఏక్టివిస్ట్ లకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా బాలల సంరక్షణ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ కార్యక్రమానికి సి.డబ్ల్యు.సి. అధ్యక్షులు గురుగుబెల్లి నరసింహమూర్తి, సి.డి.పి.ఓ.లు, వ్యక్తిత్యవికాస నిపుణులు జయదేవ్, కళాశాల లెక్చరర్ పి.సురేఖ, మహిళా వైద్యులు, కుటుంబ సంక్షేమ సలహాకేంద్రం సభ్యులు కె.వేణుగోపాల్, మహిళా సంక్షేమ సమితి సభ్యులు సత్యవాణి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎ.ఎస్.ఐ. పి.వి.రమణ, జిల్లా చైల్డ్ ప్రోటెక్షన్ అధికారి కె.వి.రమణ, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సింహాచలం, సి.డబ్ల్యు.సి. సభ్యులు బి.సురేష్, సి.హెచ్.శశిభూషణరావు తదితరులు హాజరైనారు.
కిశోరీ దశ అత్యంత కీలకం : మహిళ మరియు శిశు అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు జి.జయదేవి