రైతులకు పంటలు ఉత్పాదకత పెంచడం ప్రభుత్వ ధ్యేయం

శ్రీకాకుళం : నవంబరు 14 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై దృష్టి పెడుతూ పంటల ఉత్పాదకతను మెరుగుపరచుటకు రైతులకు విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు వంటి నాణ్యమైన ఉత్పాదకాలను రైతులకు అందించుటకు ప్రతి గ్రామ సచివాయంలో గ్రామ వ్యవసాయ దుకాణాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్టు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీటికోసం ప్రతి మండల కేంద్రంలో గోదాములు, గ్రామ సచివాలయం స్థాయిలో 12 మరియు 12 అడుగుల సైజు దుకాణాలు ఏర్పాటు చేయవలసి ఉన్నదని తెలిపారు.ఈ గోదాముల ద్వారా గ్రామ సచివాలయాలకు ఉత్పాదకాలను చేరవేయబడునని తెలిపారు. ఇందు కొరకు ప్రస్తుతానికి ప్రతి మండల కేంద్రాన్ని ప్రధాన స్థావరంగా దానికి అనుసంధానంగా 4 గ్రామ సచివాలయాలలో విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ భూమిని గుర్తించి తగు చర్యలు చేపడుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.