పోలీసు క్వార్టర్స్ పోకిరీలకు అడ్డా

నెల్లూరు : నవంబరు 18 : నెల్లూరు నగరంలోని మూలాపేటలో పాత పోలీసు క్వార్టర్స్‌ (గ్యాస్‌ గోదాము ముందు వైపు) భవనాలు పోకిరీలకు అడ్డాగా మారాయి. గతంలో పోలీసు సిబ్బంది నివాసం ఉండేవారు. దీంతో అక్కడి ప్రజలు నిర్భయంగా జీవించేవారు.కాలక్రమేణా క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరడంతో అక్కడున్న వారందరూ నూతనంగా మూలాపేట, నవాబుపేటల్లో నిర్మించిన పోలీసు క్వార్టర్స్‌కు వెళ్లిపోయారు.దీంతో వాటి ఆలనా పాలనా పట్టించుకునేవారు కరువయ్యారు.క్వార్టర్స్‌కు ఉన్న కిటికీలు, తలుపులను సైతం కొందరు అపహరించుకుని వెళ్లారు. చుట్టు పక్కల ఏపుగా చెట్లు పెరిగాయి.భవనం గది లోపల, పైన ఖాళీ మద్యం బాటిళ్లు ఈ క్రమంలో అసాంఘిక శక్తులు ఆ క్వార్టర్స్‌ను ఆవాసాలుగా చేసుకుని జోరుగా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నిత్యం ఆ క్వార్టర్స్‌ భవనాల్లోకి చేరి మద్య సేవనం చేస్తున్నారు. శిథిల క్వార్టర్స్‌ భవనాల్లో పేకాట, వ్యభిచారం తదితర కార్యక్రమాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు రిక్షా కార్మికులు, స్థానికేతరులు శిథిల భవనాల్లో తలదాచుకుంటూ గంజాయి వంటి మత్తు పదార్థాలను తాగుతున్నారు.మొక్కుబడి గస్తీ చర్యలు క్వార్టర్స్‌కు సమీపంలో ప్రజల నివాసాలు ఉన్నాయి. వారి పిల్లలు క్వార్టర్స్‌ మీదుగానే విద్యాసంస్థలకు వెళ్లాల్సి ఉంది. దీంతో  అసాంఘిక శక్తులు అటుగా వెళ్లే విద్యార్థినులను, మహిళలు, యువతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటి, రెండు రోజులు పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించి ఆపై అటు వైపునకు వెళ్లడం మానేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసాంఘిక శక్తులు, అల్లరి మూకలు యథేచ్ఛగా విజృంభిస్తున్నాయి. తాజాగా రెండు రోజుల కిందట ఓ విద్యార్థినిని కొందరు వ్యక్తులు తరుముకుంటూ వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.బాధిత బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. దీంతో బాధిత బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కన్నీటి పర్యంతమైంది. బాలిక కావడం విషయం బయటకు పొక్కితే ఎక్కడ పరువు పోతుందోనని వారు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసించలేదు.ఈ తరహా ఘటనలు అనేకం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.