శ్రీకాకుళం : నవంబరు 29 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవ శకం కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి పింఛన్ల రూపంలో ఆర్ధిక సహాయం అందించుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో ప్రభుత్వం సూచించిన మేరకు తీవ్ర అనారోగ్యం కారణంగా బాధపడుతున్న వారి వివరాల సేకరణపై శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం సూచించిన మేరకు తలసేమియా మేజర్,సికిల్ సెల్ ఎనీమియా,సివియర్ హీమోఫీలియా, బైలేటరల్ ఎలీఫాన్టియాసిస్ (బోదకాలు) - గ్రేడ్ 4, నడవలేని స్థితిలో గల పేరాలిసిస్(పక్షవాతం), ప్రమాదం కారణంగా మంచం పట్టినవారు మరియు అన్ని కండరాలు బిగుసుకు పోవడం వలన మంచం పట్టినవారు, 3,4,5 దశల్లో ఉన్న కిడ్నీ రోగులు మూడు నెలల సమయంలో సీరం క్రియాటిన్ 5 ఎం.జికి పైబడి కనిపించడం, సోనో గ్రాఫిక్ పరీక్షలలో 8 సెం.మీ కంటే తక్కువగా కిడ్నీ పరిమాణం ఉన్నట్లు ధృవపడినవారు, జి.ఎఫ్.ఆర్ 15 ఎం.ఎల్. కంటే అధికంగా ఉన్న వ్యాధిగ్రస్తులు లెప్రసి వలన బహుళ అవయవాల లోపం కలిగిన వారు వై యస్ ఆర్ ఆరోగ్య శ్రీ క్రింద కిడ్నీ, కాలేయం, గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగినవారికి పింఛను వర్తింపజేయుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. సంబంధిత వ్యాధులకు సంబంధించిన వ్యక్తుల జాబితాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. జాబితాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని అన్నారు. శత శాతం అర్హత కలిగిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసారు. జాబితాలు డిసెంబరు 9వ తేదీ నాటికి సమర్పించాలని పేర్కొన్నారు. అర్హులైన వ్యక్తుల ఆధార్, బ్యాంకు ఖాతాల నంబర్లతో సహా సమర్పించాలని స్పష్టం చేసారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా ఎం. చెంచయ్య, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా బి.సూర్యారావు, జిల్లా మలేరియా అధికారి వీర్రాజు, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా కె. సాయిరాం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా కృష్ణ మూర్తి,అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా బి.జగన్నాధ రావు, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. లీలా, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు దానేటి శ్రీధర్, కె. అమ్మన్నాయుడు, పైడి మహేశ్వర రావు, మందుల మోహన రావు, ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి అందరికీ పింఛన్లు