శ్రీకాకుళం : నవంబరు 19: సంక్షేమ పథకాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వై.ఎస్.ఆర్. నవశకం కార్యక్రమంపై నోడల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తహశీల్దారులు, మండల అభివృధ్ధి అధికారుల ఓరియెంటేషన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. రైస్ కార్డులు, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ కార్డులు, వై.ఎస్.ఆర్. పెన్షన్ కార్డులు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వాసంతి దీవెన, వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ, వై.ఎస్.ఆర్.అమ్మ ఒడి, కాపు నేస్తం, రజక, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్ధిక సాయం, అర్చకులకు జీతాల పెంపుదల, ఇమామ్ లు, మౌజామ్స్, పాస్టర్లకు గౌరవ వేతనం తదితర సంక్షేమ పథకాలపై అవగాహనా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ పథకాలను నిజమైన లబ్దిదారులు అందచేయాలన్నారు. ఇందులో వాలంటీర్ల పాత్ర అత్యంత ప్రముఖమైనదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల నియామకం ప్రక్రియ బుధవారం లోగా పూర్తి చేయాలన్నారు. గురువారం నాటికి వారందరూ తమతమ విధులలో చేరాల్సి వుంటుందన్నారు. క్లస్టర్ల పరిధిలో వున్న సెక్రటేరియట్ వివరాలను మ్యాపింగ్ చేయాలన్నారు. వీరందరికీ సంక్షేమ పథకాలపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సెక్రటేరియట్ వారీగా గ్రామ సభలను నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాలలోను బుధవారం నాడు గ్రామసభలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ముందుగా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని,డేటా ఎంట్రీలు పూర్తి చేయాలని, అనంతరం సోషల్ ఆడిట్ నిమిత్తం డ్రాఫ్ట్ ప్రతిని డిస్ప్లే చేయాలన్నారు. లబ్దిదారుల నుండి అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల వివరాలను ఆహ్వానించాలన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా పునఃపరిశీలన చేయాలన్నారు. అనంతరం లబ్దిదారుల తుది జాబితా ప్రచురణ చేయాలన్నారు. వై.ఎస్.ఆర్.పింఛను కొత్తగా పొందడానికి ఎం.డి.ఓ, మున్సిపల్ కమీషనర్ల కార్యాలయాలకు లబ్దిదారులు సంబంధిత ధృవపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకుంటారని, గ్రామ పంచాయితీ, మండల స్ధాయి, జిల్లా స్థాయి గ్రీవియన్స్ ద్వారా మరియు అర్బన్ ప్రాంతాలలో మున్సిపల్ కమీషనర్లకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అనంతరం ఎం.డి.ఓ.లు, మున్సిపల్ కమీషనర్లు సదరు దరఖాస్తులను వారి అర్హతను పరిశీలించి అప్ లోడ్ చేయాలని తెలిపారు. హౌస్ హోల్డ్ సర్వే నవంబరు 20 వ తేదీ నుండి 30వ తేదీ లోగా జరపాలని తెలిపారు. పింఛనులు కొత్త నిబంధనల ననుసరించి మంజూరు చేయాలని తెలిపారు. కుటుంబానికి గ్రామీణ ప్రాంతాలకు రూ.10 వేల నెలసరి ఆదాయం, పట్టణ ప్రాంతాలకు రూ.12 వేల ఆదాయం మించి వుండరాదని తెలిపారు. 3 ఎకరాల లోపు వెట్ ల్యాండ్ , 10 ఎకరాల లోపు డ్రై ల్యాండ్ వుండవచ్చునని తెలిపారు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు వుండాలని, సానిటరీ వర్కర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు అనర్హులని తెలిపారు. టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహా, నాలుగు చక్రాల వాహనాలు కలిగి వుండరాదని, ఆదాయపు పన్ను కట్టే వారు అనర్హులని, ఆధార్ ననుసరించి వయసు సరిపోవాలని తెలిపారు. వివిధ పింఛనులకు నిర్దేశించిన వయస్సు వుండాలని తెలిపారు. వాలంటీర్ రోజువారీ అయిదు ఇళ్ళను సర్వే చేయాలన్నారు. అనంతరం సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు రైస్ కార్డుల మంజూరుపై అవగాహన కలిగించారు. గ్రామ సెక్రటేరియట్ చేపట్టే విధులు మున్సిపల్ ప్రాంతాలలోని వార్డు సెక్రటరీలు నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 21న రైస్ కార్డులపై గ్రామ సభలను నిర్వహించాలని, 20న టామ్ టామ్ చేయాలని తెలిపారు. తహశీల్దారులు, మండల అభివృధ్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు,సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు. నిక్కచ్చిగాను, పారదర్శకంగాను అర్హులకు పథకాలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి. చక్రధరరావు, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్ధ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనరు గీతాదేవి, పాలకొండ మున్సిపల్ కమీషనరు వై.లిల్లీ పుష్పనాధం, పలాస, ఇఛ్ఛాపురం, రాజాం మున్సిపల్ కార్యాలయ అధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.కమల, ఎం.డి.ఓ.లు, తహశీల్దారులు, నోడల్ అధికారులు హాజరైనారు.
ప్రభుత్వ పథకాలు అధికారులు విధిగా తెలుసుకోవాలి