గుంటూరు : నవంబరు 13 : వెలుగు యానిమేటర్లకు, మెప్మాల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా, వంటావార్పునకు యానిమేటర్లు, ఆర్‌పిలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు గుంటూరు తూర్పు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే యానిమేటర్లకు రూ.10వేలు వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి ఐదు నెలలవుతున్నా ఇంత వరకూ అమలు చేయలేదన్నారు. పెంచిన వేతనాలు అమలు చేయకపోవటం వల్ల క్షేత్ర స్థాయిలో యానిమేటర్లపై రాజకీయే వేధింపులు అధికమయ్యాయన్నారు. జిల్లాలో 271 మందిని తొలగించటమే వేధింపులకు నిదర్శనమన్నారు.తొలగింపు ఆవేదనతో క్రాంతికుమార్ అనే విఒఎ ఆత్మహత్య చేసుకుందన్నారు.ఇప్పటికైనా స్పందించి వేధింపులు అరికట్టటానికి చర్యలు తీసుకోవాలని, తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నేతాజి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే వైసీపీ ప్రభుత్వం కూడా చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడుతుందని, ఇదే విధంగా కొనసాగితే వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.యానిమేటర్ల సంఘం జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వేతనాలు పెంచుతూ మొదటి సంతకం చేసినా ఇంత వరకూ జిఒ ఇవ్వకపోవటం దారుణమన్నారు. సిఐటియు నగర కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో యానిమేటర్లు, ఇతర స్కీమ్ వర్కర్లు చేసిన పోరాటాల ఫలితంగానే వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ప్రభుత్వానికి చిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెంచిన వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యానిమేటర్ల సంఘం నాయకులు పద్మ, జ్యోతి, రామారావు, నరసింహారావు, ఆర్‌పిల సంఘం నాయకులు అచ్చమాంబ, సైదాబి, అంకమ్మ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు
వేతనాలు పెంపు జి.ఓ. వెంటనే విడుదల చేయాలి