మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు నిర్ణయం

న్యూఢిల్లీ : నవంబరు : 25 మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ,గవర్నర్‌ వద్ద కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్‌భవన్‌ మెజారిటీని నిరూపించజాలదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపులు నిరోధించాలంటే వెంటనే బలపరీక్ష జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్‌పై ఆదివారం సెలవురోజు అయినప్పటికీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫడ్నవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్‌ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్‌ గవర్నర్‌కు రాసిన లేఖను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ లేఖలను సోలిసిటర్‌ జనరల్‌ సోమవారం న్యాయస్థానానికి అందజేశారు. ఈ రెండు లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ఆదివారం విచారణ సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ లేకపోవడంతో ఆ లేఖలను తమకు అందజేసే బాధ్యత తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది. అయితే, 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఆ లేఖలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం,24 గంటల్లోగా బల నిరూపణను ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను గవర్నర్‌ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్‌కు ఫడ్నవీస్‌ పంపిన లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం' అని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి 'మహా వికాస్‌ అఘాడి'ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలన్న వినతిని సైతం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వినతిని పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సెలవు రోజైనప్పటికీ ఆదివారం విచారణను కోర్టు ప్రారంభించడం విశేషం.