సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో ఉద్యోగుల పాత్ర కీలకం : రాష్ట్ర స్పీకర్

శ్రీకాకుళం : నవంబరు 3: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  జిల్లా కౌన్సిల్  మొదటి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్పీకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం రూపొందించిన శాసనాలను అమలుచేసేది ఉద్యోగులేనన్నారు.  ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి వారధులని, ప్రభుత్వంలో ఒక భాగమని అన్నారు. సమస్యలను పరిష్కరించే సంఘాలనే ఆదరిస్తారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వుద్యోగుల సంఘం ఆ దిశగా పనిచేయాలని కోరారు. హెల్త్ కార్డులు, పని భారం, తదతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు విలువలకు కట్టుబడి వుండాలన్నారు.పదవీవిరమణ పొందేనాటికి వారు స్థిర నివాసం ఏర్పరుచుకునే ప్రాంతంలో ఇళ్ళను నిర్మిస్తామన్నారు. పారిశుధ్ధ్య కార్మికులు, హోంగార్డులు, ఆశావర్కర్లకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్నారు. ప్రతీ కుటుంబానికి వికాసం కలిగించేలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఇందలో భాగమేనన్నారు. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగి బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల సానుకూల  ధృక్పధంతో వున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ముఖ్యమంత్రి  103 జి.ఓ. ద్వారా గుర్తింపు నిచ్చారని చెప్పారు. తాను 17 సం.ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసానని, ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసునని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు.  శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి   ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వున్నారని, ఉద్యోగులు  ప్రభుత్వ కన్నబిడ్డలు అని అన్నారు. అంకితభావం, మంచి పోరాటపటిమ కలిగిన వ్యక్తి కె.ఆర్.సూర్యనారాయణ సంఘానికి నాయకత్వం వహించడం చాలా మంచి పరిణామమని  అన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ఉద్యోగ మెంబరుగా తాను పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికిఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, జిల్లా ఖజానాధికారి జి.నిర్మలమ్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి.అస్కారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పింగళి గిరిధర్, డి.శ్రీకాంత్ రాజు, ఐ.రఘుబాబు, వినయ్ మోహన్, జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు హాజరైనారు.