వై.యస్.ఆర్.నవోదయం కరపత్రం ఆవిష్కరణ

శ్రీకాకుళం : నవంబరు 18 : సూక్ష్మ, మద్యతరహా పరిశ్రమలకు (ఎం.ఎస్.ఎం.ఇ) ఏకకాల పునర్వ్యవస్ధీకరణ (ఓటిఆర్ – వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్) అమలును పర్యవేక్షించుటకు ప్రవేశపెట్టిన డా.వై.యస్.ఆర్ నవోదయం కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమ వారం స్పందన కార్యక్రమంలో ఆవిష్కరించారు. నవోదయం కార్యక్రమం ద్వారా ఎం.ఎస్.ఎం.ఇలకు నూతన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని కలెక్టర్ అన్నారు. ఆర్.బి.ఐ నిబంధనల మేరకు 2020 మార్చి 31వ తేదీలోగా సంక్షోభంలో ఉన్న ఎం.ఎస్.ఎం.ఇ ల పునరుద్ధరణ, అభివృద్ధికి సహాయకారిగా ఉంటుందని చెప్పారు. జిల్లా స్దాయి కమిటి పర్యవేక్షిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ పథకం క్రింద లబ్దిపొందుటకు 2019 జనవరి 1వ తేదీ నాటికి రుణ గ్రహీతకు మొత్తం రుణం రూ.25 కోట్లకు మించకుండా ఉండాలని,  రుణగ్రహీత ఖాతా 2019 జనవరి 1వ తేదీ నాటికి డిఫాల్ట్ గా ఉన్నప్పటికి స్టాండర్డ్ అసెట్ గా ఉండాలని, జి.ఎస్.టిలో నమోదై ఉండాలని అన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం పునర్వ్యవస్ధీకరణ పొందిన యూనిట్లకు చేయూతను అందిస్తుందని చెప్పారు. బ్యాంకులు పునర్వ్యవస్ధీకరణ చేస్తే అటువంటి సంస్ధలు టెక్నో ఎకనామిక్ వయబిలిటి  నివేదికను సమర్పించాలని తదనుగుణంగా ఒక్కో ఖాతాకు 50 శాతం రుసుమును రూ.2 లక్షలకు మించకుండా ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. నిరర్ధక ఆస్తులుగా పరిగణింపబడిన కేసులలో ప్రోత్సాహకాల విడుదలకు ప్రాధాన్యతనిచ్చి రుణాల క్రమబద్దీకరణకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రోత్సాహకాల విడుదలకు ఎం.ఎస్.ఎం.ఇలు నిబంధనలలో తెలిపిన మేరకు ధృవపత్రాలను అప్ లోడ్ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ -2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాల కృష్ణ, ఉప సంచాలకులు రవిశంకర్, ఏపిఐఐసి మేనేజర్ బి.హరి తదితరులు పాల్గొన్నారు.