శ్రీకాకుళం : నవంబరు 15 : రైతులు వ్యవసాయ యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పిలుపునిచ్చారు. శుక్ర వారం సాయంత్రం బలగలోగల కుబోటో వ్యవసాయ యాంత్రీకరణ షోరూం వద్ద ధాన్యం కంబైన్డు హార్వెస్టర్లు మూడింటిని మంత్రి రైతులకు పంపిణీ చేసారు.24,73,500 రూపాయలు విలువగల ఒక్కో కంబైన్డు హార్వెస్టర్ కు ప్రభుత్వం 9,19,400 రూపాయలను ప్రభుత్వం రాయితీ కల్పిస్తుండగా మిగిలిన మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో వ్యవసాయ యాంత్రీకరణ అత్యావశ్యమని మంత్రి అన్నారు. రైతుకు అదును – పదును ఉంటుందని సకాలంలో యంత్రసామగ్రిని అందజేయడం వలన ప్రయోజనం ఉంటుందని చెప్పారు. కోతల సమయంలో కంబైన్టు హార్వెస్టర్లు అందించడం ఉపయోగకరమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయుటకు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పారు. రాయితీపై అందించాల్సిన యంత్ర సామగ్రిని సకాలంలో అందించుటకు అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటామని, బిల్లుల బకాయిలు త్వరితగతిన పరిష్కారం కావడానికి చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు.కుబోటో షో రూం డీలర్ డా.ఎం.బాలచంద్రరావు నాయుడు మాట్లాడుతూ యాంత్రీకరణకు ప్రభుత్వం 60 నుండి 70 శాతం వరకు వివిధ పనిముట్లపై రాయితీ కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం నుండి అందాల్సిన రాయితీ మొత్తం త్వరితగతిన విడుదల చేయడం వలన రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బి.జి.వి.ప్రసాద్, ఉపసంచాలకులు కె.శ్రీధర్, వ్యవసాయ అధికారి వై.సురేష్, డిసిఎంఎస్ మాజీ అధ్యక్షులు గొండు కృష్ణమూర్తి, గొండు రఘురాం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైతులు యాంత్రికరణ దిశగా అడుగులు వేయాలి : జిల్లా కలెక్టరు