ఆ లోకో ఫైలట్ కు పనిభారమే ప్రమాదానికి కారణమా? ? ?

హైదారాబాద్‌ : నవంబరు 13: ఎంఎంటీఎస్‌ రైళ్ల వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్షణాల్లో వేగాన్ని అందుకునే శక్తి వీటి సొంతం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఎంటీఎస్‌ రైళ్ల వేగం ఇంకా ఎక్కువగా ఉంది. పాత ఎంఎంటీఎస్‌ రైళ్ల ఇంజిన్‌కు ఒక హార్స్‌ పవర్‌ వేగం ఉంటే కొత్తగా వచ్చిన రైళ్లకు మూడు హార్స్ పవర్ వేగం ఉందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వేగమే కాచిగూడ స్టేషన్‌లో సోమవారం ప్రమాదానికి కారణమైందని చెప్పవచ్చు.సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ మాత్రమే ప్రధాన లైను నుంచి కాచిగూడలోని నాలుగో ప్లాట్‌ఫాం మీదకు తిరిగింది. ఈ ఇంజిన్‌ను ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే వేగంతో హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలను ఢీకొంటే పెను ప్రమాదం సంభవించేదని ఘటనాస్థలిని పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్‌ ఇంజిన్‌ ముందు ఉంది. దీనిని ఢీకొట్టడంతో వెనుక ఉన్న బోగీలు రైలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి కాని అవి కిందపడడం కాని నుజ్జునుజ్జు అవ్వడం జరగలేదు.ప్లాట్‌ఫాం మీదే వేగాన్ని అందుకుంటుంది.ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్లాట్‌ఫాం దాటకముందే వేగాన్ని అందుకుంటాయి. పాత ఎంఎంటీఎస్‌ ఒక హార్స్‌పవర్‌తో నడుస్తుంది. ఈ రైలు వేగాన్ని ప్రయాణికులు అంచనా వేయలేకపోయేవారు. రైలు ఎక్కుతూ కొంతమంది రైలు ఇప్పుడే మొదలైంది కదా అని ట్రాక్‌ను దాటుతూ కొంతమంది ప్రమాదాలకు గురయ్యారు. ఆరు నెలల క్రితం కొత్తగా వచ్చిన ఎంఎంటీఎస్‌ రైళ్లకు త్రీహార్స్‌ పవర్‌ ఇంజిన్‌ ఉంది. 30 క్షణాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌కు విశ్రాంతి కరవైందా? రైలు ప్రమాదానికి కారమని భావిస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు లోకోపైలట్‌ ఎల్‌ చంద్రశేఖర్‌ అనుభవజ్ఞుడే. సోమవారం మరి ఏమయ్యిందో కాచిగూడలో సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు దూసుకెళ్లాడ'ని రైల్వే ఉన్నతాధికారులంటున్నారు. చంద్రశేఖర్‌ 2011లో సహాయ లోకోపైలట్‌గా చేరాడు. అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి లోకోపైలట్‌గా మారాడు. మూడు నెలల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను మొత్తం 48 ట్రిప్పులు తిప్పాడు. లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంపై పూర్తి పట్టు ఉంది. సిగ్నల్‌ను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమైంది. పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం తదితర కోణాల్లో ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌ కేర్‌ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో వైద్యం పొందుతున్నాడు.