శ్రీకాకుళం : నవంబరు 17: రహదారి ప్రమాదరహిత జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను రూపొందించడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్.పి. కార్యాలయంలో వరల్డ్ రిమంబెరెన్స్ డే సందర్భంగా రహదారి ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, లైసెన్స్ లేని మైనర్లు వాహనాలు నడపడం, అధిక వేగం కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. కుటుంబంలోని సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నమవుతుందన్నారు. పిల్లలను కోల్పోయిన తల్లితండ్రులు జీవితాంతం మనోవేదనకు గురికాబడతారన్నారు. కావున వాహన నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమనిబంధనలను పాటించాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడుపరాదన్నారు. లైసెన్సు లేని వారు, మైనర్లు వాహనాన్ని నడుపరాదన్నారు. రహదారి ప్రమాదం జరిగినప్పుడు థర్డ్ పార్టీ వారు అనగా ప్రమాద స్థలంలో వున్నవారు వెంటనే స్పందించి ప్రమాదబాధితులకు సాయం అందించాలన్నారు. సెల్ ఫోన్ ద్వారా ప్రమాద స్థల పరిసరాలతో సహా ఫోటో తీయాలని, వెంటనే దగ్గర వున్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. తాము కోర్టుల చుట్టూ సాక్ష్యాల కోసం నిరంతరం తిరగవలసి వస్తుందనే అపోహను తొలగించుకోవాలని తెలిపారు. కేవలం చిన్న సాక్షిగా మాత్రమే వుంటారని, లోక్ అదాలత్ ద్వారా బాధితులు, బాధ్యులు కాంప్రమైజ్ కావచ్చునని తెలిపారు. ఈ రోజు వరల్డ్ రిమెంబ్రెన్సు డే సందర్భంగా ప్రమాదం సంభవించిన కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడించి వారి మనోవేదనను అర్ధం చేసుకోవడం జరుగుతున్నదన్నారు. దీని వలన అందిరిలో అవగాహన కలిగి, ప్రమాదాలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం వుంటుందని తెలిపారు.
రహదారి ప్రమాద రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం