శ్రీకాకుళం : నవంబరు 17 : విద్యార్థులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను చెత్తబుట్టలో మాత్రమే వేయాలని, ప్లాస్టిక్ వాడకం చేయకూడదని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. ఆదివారం ఉమెన్స్ కళాశాల నందు స్వచ్చభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రంచేసారు. కళాశాల పరిసరాలలో గల చెత్తను విద్యార్థినులతో కలిసి శుభ్రంచేసారు. సుమారు 600 మంది విద్యార్థినులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం కళాశాల ప్రాంగణంలో గల హాస్టలు భవనాల పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిసరాల శుభ్రతపై విద్యార్థినులకు ఆయన అవగాహన కల్పించారు.కళాశాల, హాస్టలు పరిసరాలను పరిశీలించినపుడు సిబ్బంది పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరిసరాలు తుప్పలు పట్టినాయని, పాములు తిరుగుతున్నాయని తెలిపారు. తుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకోవలసినదిగా కలెక్టరును కోరారు. అదేవిధంగా హోస్టలు, కళాశాల ప్రాంగణంనుండి మురుగునీరు పోవు మార్గము మూసిపోయినదని, దానిని అన్యాక్రాంతం చేసారని తెలుపగా, ఆయన స్వయంగా పరిశీలించారు, వెంటనే చర్యలు తీసుకోవలసినదిగా మున్సిపల్ కమీషనరు గీతాదేవి కి ఆదేశించారు.కళాశాల ప్రాంగణంలో మంచినీటి కుళాయి వెంటనే ఏర్పాటు చేయవలసినదిగా మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. కళాశాలలో చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రంచేయాలని తెలిపారు. హాస్టలులో గల సదుపాయాలు, సమస్యలను గూర్చి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. హాస్టలులో విద్యార్థినులు కోరిన మౌళిక సదుపాయాలు ఏర్పాటు గూర్చి త్వరలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.పరిసర ప్రాంతప్రజలు కళాశాలలో చెత్తను వేస్తున్న విషయాన్ని గమనించిన మున్సిపల్ కమీషనరు ఇకముందు కళాశాలలో చెత్తను వేస్తే కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనరు గీతాదేవి, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మి, వార్డెన్స్ శ్రీలక్ష్మి,ఉషారాణి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి