శ్రీకాకుళం : నవంబరు 28 : భారతదేశంలో అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్థంతి సందర్భంగా సాయిగిరి వద్ద గల జ్యోతిరావు పూలే పార్కులో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ దేశంలో అణగారిన సామాజిక వర్గాలు ఉన్నతస్థానాలకు వచ్చారంటే వారు సాధించిన పోరాట ఫలితమే అన్నారు. తద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంగా తలెత్తుకొని తిరిగేలా ఆత్మస్థైర్యాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ప్రతీ సామాజిక వర్గాల వారు ఆయన వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించాల్సిన తరుణమిది అని శాసనసభాపతి గుర్తుచేసారు. మనదేశం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్.అంబేద్కర్, రాజారామ్మోహన్ రాయ్ వంటి సామాజిక సంఘసంస్కర్తలు ఎంతో శ్రమించారని, వారి పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. అటువంటి మహనీయుల ఆశయాలను ముందుకుతీసుకువెళ్లాలని, ప్రతీ ఒక్కరూ వారి ఆశయసాథనకోసం పోరాడాలని శాసనసభాపతి ఈ సందర్భంగా కోరారు. దేశం కోసం పోరాటం చేసే మహానీయుల ఇచ్చిన పోరాట స్పూర్తి భవిష్యత్ తరానికి అందించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చురు.రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ భారతదేశం గౌరవించదగ్గ మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు.రాష్ట్రయావత్తు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడుతోందని చెప్పారు. సమాజాన్ని దిశ, దశ మార్చగలిగే ప్రతిభా మేధావి జ్యోతిరావు పూలే అని, స్త్రీ విద్యను ప్రోత్సహించే వ్యక్తిగా కొనియాడిన మహోన్నత వ్యక్తి పూలే అని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలవారికి సముచితస్థానం కావాలని పోరాటం చేసి విజయం సాధించారని, ఇటువంటి మహా వ్యక్తులను ప్రతీ ఒక్కరూ స్మరించుకోవలసిన తరుణమిది అని అన్నారు. విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి చేతులమీదుగా మహాత్మాజ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడుతుందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పూలమాలను వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి, శ్రీకాకుళం పురపాలక సంఘం మాజీ ఛైర్ పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, తహశీల్ధారు ఐ.టి.కుమార్, బి.సి.సంక్షేమ శాఖ అధికారి కె.కృతిక, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, విశ్రాంత ఉద్యోగి సురంగి మోహనరావు, వివిధ కులసంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నిమ్న జాతుల ఆశాజ్యోతి "పూలే" స్పీకర్ తమ్మినేని