నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు : సి.యమ్.

అమరావతి : నవంబరు 19 : మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బార్ల పాలసీపై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి ప్రభుత్వం తగ్గించనుంది. బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 20శాతం మద్యం దుకాణాలను తగ్గించామని, విడతల వారీగా పూర్తిగా తగ్గిస్తామని అధికారులు తెలిపారు.ఇక బార్ల సంఖ్యను కుదించే క్రమంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ మద్యం సరఫరా వేళల్ని కుదించింది. బార్లలో మద్యం సరఫరాకు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, ఆహారం  రాత్రి 11 వరకు స్టార్‌ హోటళ్లలో మద్యం అమ్మకాలు ఉదయం 11నుంచి రాత్రి 11 వరకు అనుమతి ఉంటుంది. దీంతోపాటు మద్యం ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు ఉంటాయని, నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. లైసెన్స్‌ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చేఅసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.