పరిశోధన ఫలాలు క్షేత్ర స్థాయిలో చేరాలి : స్పీకర్ తమ్మినేని

శ్రీకాకుళం : నవంబరు 19 : వ్యవసాయ పరిశోధనా ఫలాలు క్షేత్ర స్ధాయికి చేరాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమం మంగళ వారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, జిల్లా కలెక్టర్ జె నివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ వ్యవసాయ విజ్ఞానం గ్రామాలకు చేరాలన్నారు.పరిశోధన ఫలితాలు, సమాచారం రైతులకు అందాలని అప్పుడే వ్యవసాయం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ వ్యవసాయం శ్రీకాకుళం రైతులు చేస్తున్నారని,జిల్లా రైతులు కష్టపడై తత్వం కలిగిన వారని అన్నారు. జిల్లాలో నాలుగు జీవ నదులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడిలో గణనీయమైన ప్రగతికి అవకాశం ఉందన్నారు. వంశధార ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని శాసన సభాపతి చెప్పారు. వైయస్ఆర్ పొలం బడికి సరైన రూపం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని గ్రామంలో గల రైతు అనుభవానికి జోడించాలని తద్వారా ఫలితాలు సాధించవచ్చని సూచించారు. వ్యవసాయ విద్యార్ధులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అక్కడ రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ముందుగా పొలం బడి షెడ్యూల్ గ్రామాలకు ఇవ్వాలని అన్నారు. రైతులకు సరైన అవగాహన కల్పిస్తే ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరని పేర్కొన్నారు. రైతులు నష్టపోకూడదని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు అందాలనే లక్ష్యంతో  ప్రభుత్వమే సచివాలయాలకు సమీపంలో వ్యవసాయ స్టోర్ లను ఏర్పాటు చేయనుందని చెప్పారు. దళారీ వ్యవస్ధ ద్వారా రైతు నష్టపోతున్నారని, మోసపోతున్నారని పేర్కొంటూ దళారీ వ్యవస్థ పోవాలని అన్నారు. పండించిన పంటలను నిల్వచేసుకునే వ్యవస్థ ఉండాలని చెప్పారు. వ్యవసాయంను ముఖ్యమంత్రి పండగ చేస్తున్నారని కొనియాడారు. రైతులకు అవగాహన కలిగించుటకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఏర్పాటు చేయాలని, ఆధునిక యాంత్రీకరణ పద్ధతులు పరిచయం చేయాలని అన్నారు. అత్యాదునిక పరిజ్ఞానాన్ని రైతులు స్వాగతించి అందులో ఫలితాలు అనుభవించాలని కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులపై రైతుకు నమ్మకం కలిగించాలని అప్పుడు రైతు వారిని వదలకుండా అనుసరిస్తాడని అద్భుత ఫలితాలు వస్తాయని సీతారాం అన్నారు.