ఐ.జె.యు.అధ్యక్షునిగా శ్రీనువాసరెడ్డి

న్యూఢిల్లీ : నవంబర్ 5 : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నూతన అధ్యక్షునిగా పాత్రికేయ ఉద్యమ రథసారధి కె. శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన జాతీయ సంఘానికి అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న సీనియర్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించడాన్ని యూనియన్ ప్రతినిధులు అభినందిస్తున్నారు. ఐజేయూ అధ్యక్షునిగా ఉన్న అమర్ దేవులపల్లి ఆంధ్రప్రదేశ్ మీడియా అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియమితులయిన కారణంగా యూనియన్ పదవికి రాజీనామా చేయడంతో కొత్త పదవికి ఎన్నిక అనివార్యమైంది.
ఈ మేరకు మంగళవారం దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌ ఆఫ్ ఇండియాలో అత్యవసరంగా సమావేశమైన ఐజేయూ జాతీయ కార్యనిర్వాహక మండలి (ఎన్ఈసీ) కేఎస్సార్‌ను ఏకవాఖ్య తీర్మానంతో ఏకగ్రీవంగా ఎన్నుకుంది. యూనియన్‌కు ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షునిగా పనిస్తున్న బల్విందర్ సింగ్ జమ్మూ నూతన సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు.ప్రభుత్వ ఉన్నత పదవిలో నియమితులైన తర్వాత ఐజేయూ అధ్యక్ష స్థానానికి దేవులపల్లి అమర్ చేసిన రాజీనామాను ఎన్ఈసీ సమావేశం తొలుత ఆమోదించింది. అమర్ దేవులపల్లి ఈ ఏడాది ఆగస్టు 29న తన పదవికి రాజీనామా చేశారు.సమావేశం ప్రారంభానికి ముందు సుప్రసిద్ధ సంపాదకులు సి. రాఘవాచారి మృతికి, హత్యకు గురైన తూర్పు గోదావరి జిల్లా తుని ఆంధ్రజ్యోతి విలేకరి కె. సత్యనారాయణ సహా వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన పలువురు జర్నలిస్టులకు ఐజేయూ జాతీయ కార్యనిర్వాహక సమితి అత్యవసర సమావేశం సంతాపం వ్యక్తం చేసింది. అమర్ దేవులపల్లి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాఘవాచారి పత్రికా రంగానికి చేసిన సేవలను, ఆయన వ్యక్తిత్వంలోని విశిష్ట తలను నాయకులు కొనియాడారు. అనంతరం సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
ఇక, ఐజేయూ నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేఎస్సార్ గురించి క్లుప్తంగా చెప్పుకోవాల్సి వస్తే… ఆయన పేరు ప్రస్తావనకు రానిదే 'పాత్రికేయ ఉద్యమ చరిత్ర'కు ముగింపు లేదు. ఇప్పుడంటే పుట్టగొడుగుల్లా పాత్రికేయ సంఘాలు పుట్టుకువచ్చాయి గానీ, అప్పట్లో ఆయన నాయకత్వమే పాత్రికేయ ప్రపంచానికి 'శ్రీరామరక్ష'లా ఉండేది. కేవలం పదవుల కోసమే ఆయన్ని వ్యతిరేకించిన వారు ఉండవచ్చు గానీ, 'పని'లో ఆయన మాట జవదాటేవారు లేరనే చెప్పాలి.
పాత్రికేయుల హక్కుల పరిరక్షణలో కానివ్వండి, వారి సమస్యల పరిష్కారంలో కానివ్వండి, వృత్తిపరంగా వారికి రక్షణగా నిలవడంలో కానివ్వండీ ఆయన్ని మించిన మేథావి లేరనడంలో సందేహంలేదు. 'ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ' ఆవిర్భావం ఆయన కృషి ఫలితమే. 'క్యాబినెట్ హోదా'తో అకాడమీకి తొలి చైర్మన్‌ పదవిని అలంకరించిందీ ఆయనే.స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి సభ్యునిగా, భారతదేశంలో అత్యధిక సభ్యులు కలిగిన 'ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్' (ఐజేయూ)కు జాతీయ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించి దేశవ్యాప్తంగా పాత్రికేయులకు సుపరిచితులయ్యారు కె. శ్రీనివాస్‌రెడ్డి.ఆయన సమకాలికులు ముద్దుగా పిలుచుకునే 'కేఎస్సార్' గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 1949 సెప్టెంబర్ 7న జన్మించిన శ్రీనివాసరెడ్డి అత్యుత్తమ వామపక్ష భావాలు కలిగిన పాత్రికేయ ఉద్యమ నాయకునిగా గుర్తింపుతెచ్చుకోవడం మన అందరి గర్వకారణం. అటువంటి 'ప్రభావశీలి' నాయకత్వం, పర్యవేక్షణలో ఐజేయూ సహా తెలుగు రాష్ట్రాలలో దాని అనుబంధ సంఘాలైన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) పాత్రికేయుల హక్కులు, సంక్షేమం విషయాల్లో సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.యాజమాన్యాల సిఫార్సులతో నిమిత్తం లేకుండా కూడా ఇవాళ చాలా వరకు జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డులు పొందగలుగుతున్నారంటే అది శ్రీనివాస్‌రెడ్డి గారి కృషి ఫలితమేనని చెప్పాలి. 'గుర్తింపు కార్డు పత్రికకో, యాజమాన్యానికో ఇస్తున్నది కాదు. పాత్రికేయునికి ఇస్తున్నది' అని జాతీయ, రాష్ట్రస్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలలో ఆయన వెల్లడించిన అభిప్రాయం మేరకే (జీవోలో మార్పు లేకపోయినా) నిబంధనలను సరళతరం చేశారన్నది చాలా మందికి తెలియని విషయం.
ఐజేయూ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. శ్రీనివాస్‌రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూను తెలుగు రాష్ట్రాల నాయకులు అభినందిస్తున్న దృశ్యం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 'విశాలాంధ్ర' రెసిడెంట్ ఎడిటర్‌గా, రాష్ఠ్ర విభజన తర్వాత ఏర్పాటైన 'మన తెలంగాణ'కు వ్యవస్థాపక ఎడిటర్‌గా కేఎస్సార్ పనిచేశారు. తర్వాత ఆయన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ప్రచురితమవుతున్న 'ప్రజాపక్షం' తెలుగు దినపత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూనే వర్ధమాన జర్నలిస్టుల వృత్తినైపుణ్యాన్ని పెంపొందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రెస్ అకాడమీకి సమాంతరంగా 'పునశ్చరణ తరగతులు' నిర్వహించే స్థాయిలో శ్రీనివాస్‌రెడ్డి సారధ్యంలోని 'మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ఇండియా'(ఎంఈఎఫ్ఐ) సంస్థ పనిచేస్తోందని చెప్పుకోవడానికి మనమంతా గర్వపడుతున్నాం.
పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యంగా, వారి సమస్యలపై పోరాటమే ఆశయంగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డిని మళ్లీ ఐజేయూ జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల దేశవ్యాప్తంగా అనేక మంది పాత్రికేయులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కె. శ్రీనివాస్‌రెడ్డిని తెలుగు రాష్ట్రాలలోని యూనియన్ నాయకులు అభినందనలతో ముచ్చెత్తారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, పూర్వ అధ్యక్షులు నల్లి ధర్మారావు, డి. సోమసుందర్, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి, జాతీయ కార్యనిర్వాహక సమితి సభ్యులు కె. సత్యనారాయణ, ఆలపాటి సురేష్ తదితరులు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పుష్పగుచ్చాలతో అభినందించారు.