ఇసుకపై ముఖ్యమంత్రి సమీక్ష

అమరావతి : నవంబరు 4: నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్లు, భవనాల శాఖపై ఆశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ముఖ్య కార్యదర్శి టి కృష్ణ బాబులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక కొరత అనేది తాత్కాలిక సమస్య అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. నదులకు 90 రోజులుగా ఊహించని రీతిలో వరద వస్తోందని 265పైగా ఇసుక రీచ్‌ల్లో ప్రస్తుతం 61 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలోనే ఉన్నాయని వెల్లడించారు. వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు.90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులకు వరద కొనసాగుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. నిరంతరం వరదల వల్ల ఇసుక సమస్య వస్తోందన్నారు. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందని విమర్శించారు. ఈ నెలాఖరు నాటికి ఇసుక సమస్య తీరుతుందని తెలిపారు. తాము అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించి కి.మీకు రూ. 4.90కు ఎవరైతే ఇసుక రవాణా చేస్తారో వారినే రమ్మన్నామని వివరించారు. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌ యార్డులు కూడా ఇస్తామన్నారు. ఇసుక అనేది తాత్కాలిక సమస్య మాత్రమేనని సీఎం మరోసారి స్పష్టం చేశారు.