శ్రీకాకుళం : నవంబరు 10 : జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించుటకు పాఠశాల విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. డా.మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి దినోత్సవాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ వేడుకలను శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలోగల ఆనందమయి కన్వెన్షన్ హాల్ లో సోమ వారం ఉదయం 9.30 గంటల నుండి నిర్వహించుటకు ఏర్పాట్లు చేసారు. రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం విద్యా పురష్కార అవార్డులు (ప్రతిభా పురష్కారాలు) ప్రధానం చేయనున్నారు. జిల్లాలో అన్ని మండలాల నుండి 224 మంది విద్యార్ధులు పురష్కారాలకు ఎంపికయ్యారు. సీతంపేట, పోలాకి మండలాల నుండి నలుగురు చొప్పున, భామిని, ఆమదాలవలస మండలాల నుండి ఆరుగురు చొప్పున మిగిలిన మండలాల నుండి ఏడు గురు చొప్పున ప్రతిభా పురష్కారాలకు ఎంపికయ్యారు. ఆమదాలవలస మండలం నుండి ఎంపికైన ఆరు గురు విద్యార్ధులు లక్ష్మీనగర్ పురపాలక పాఠశాల నుండే ఎంపిక కావడం విశేషం. ఈ పాఠశాలలో చేరుటకు ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో క్యూ కట్టడం అందరికి విదితమే. ప్రతిభా పురష్కారాలను అందుకొనుటకు విద్యార్ధులు హాజరు కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి చంద్ర కళ కోరారు. ప్రతి ఏడాది రాష్ట్ర స్ధాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభా పురష్కారాలను ప్రధానం చేసేవారని, ఈ ఏడాది జిల్లా స్ధాయిలోనే కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రధానం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఆమె చెప్పారు. ప్రతిభా పురష్కారాలకు ఎంపికైన విద్యార్ధులకు రూ.20 వేల నగదు, ధృవీకరణ పత్రం, బంగారు పతకం, ఒక ట్యాబ్ ను అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
రేపు జాతీయ విద్యా దినోత్సవ పురస్కారాలు